పుజారా గురించి మీకు ఈ విషయాలు తెలుసా!?

25 Jan, 2021 12:53 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా నయా ‘వాల్‌’, మిస్టర్‌ డిపెండబుల్‌ ఛతేశ్వర్‌ పుజారా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు పుజ్జీని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, హనుమ విహారి సహా హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌, వసీం జాఫర్‌ తదితరులు అతడిని విష్‌ చేయగా, బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేకంగా అభినందనలు‌ తెలిపాయి. ఈ సందర్భంగా.. సౌరాష్ట్ర జట్టు తరఫున క్రికెట్‌ కెరీర్‌ ఆరంభించిన టెస్టు స్పెషలిస్టు పుజ్జీ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం. 

ఛతేశ్వర్‌ పుజారా 1988, జనవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించాడు.
అతడి పూర్తి పేరు ఛతేశ్వర్‌ అరవింద్‌ పుజారా. చే, పుజీ, పూజ్‌, స్టీవ్‌ అనే ముద్దుపేర్లు కూడా ఉన్నాయి
పుజారా తండ్రి అరవింద్‌, అంకుల్‌ బిపిన్‌ సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడారు.
పుజారా బీబీఏ చదువుకున్నాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌ పట్ల మక్కువ గల అతడు.. అండర్‌-19 కేటగిరీలో 2005లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌-2006లో మూడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. 
భారత్‌- ఆస్ట్రేలియా మధ్య 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్టుతో పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. యువరాజ్‌సింగ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4(బౌండరీ) పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో సత్తా చాటాడు.
2012లో తిరిగి జట్టులోకి వచ్చిన పుజారా.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. క్రమంగా అవకాశాలు దక్కించుకుంటూ మిస్టర్‌ డిపెంబుల్‌, వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడిగా ఎదిగాడు.
కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 81 టెస్టులు ఆడిన పుజారా, 13572 బంతులు ఎదుర్కొని 6111 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు చేశాడు. చివరిగా బ్రిస్బేన్‌ టెస్టు(జనవరి 15, 2021) ఆడాడు.
టెస్టుల్లో మూడు డబుల్‌ సెంచరీలు పుజారా పేరిట ఉన్నాయి. అత్యధిక స్కోరు 206 
ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో  8 ఇన్నింగ్స్‌లు కలిపి 271 పరుగులు చేసిన పుజారా జట్టు చరిత్రాత్మక విజయంలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 
ఇక ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే... 2010లో దక్కన్‌ చార్జర్స్‌ తరఫున బరిలోకి దిగిన పుజారా, 2014లో ముంబై ఇండియన్స్‌ తరఫున వాంఖడే స్టేడియంలో చివరి ఐపీల్‌ మ్యాచ్‌ ఆడాడు. 
పుజారాకు 2013లో పూజా పబరీతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు అతిథి ఉంది.

చదవండిమిస్టర్‌ డిపెండబుల్‌.. హ్యాపీ బర్త్‌డే పుజ్జీ..!

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు