‘వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌’ వచ్చేసింది...

28 Jul, 2020 00:39 IST|Sakshi

షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

ఇంగ్లండ్‌–ఐర్లాండ్‌ పోరుతో షురూ

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ తరహాలో వన్డేల్లో కూడా పాయింట్ల పద్ధతిలో టోర్నీ తీసుకురావాలని భావించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తమ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తోంది. గతంలోనే ప్రకటించి కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గినా... ఇప్పుడు టోర్నీ జరగడం ఖాయమైంది. ఈ నెల 30నుంచి ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ‘క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ ’ పేరుతో జరిగే ఈ ఈవెంట్‌... టి20ల మెరుపులతో ప్రభ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా నిలబెట్టగలదని ఐసీసీ ఆశిస్తోంది.

వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు ఉండటంతో కొంత కాలం క్రితం ఈ టోర్నీపై ప్రణాళిక రూపొందించి కూడా ఐసీసీ వెనక్కి తగ్గింది. కోవిడ్‌–19 నేపథ్యంలో పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. అయితే 2023 ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్‌ కప్‌ అక్టోబర్‌–నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

టోర్నీ ఎప్పటినుంచి...
జూలై 30 నుంచి ఇంగ్లండ్‌–ఐర్లాండ్‌ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ మొదలవుతుంది. ఇందులో భాగంగా జులై 30, ఆగస్టు 1, ఆగస్టు 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

పాల్గొనే జట్లు
మొత్తం 13 టీమ్‌లు సూపర్‌ లీగ్‌లో ఆడతాయి. ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌–12 జట్లతో పాటు 2015–17 ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ సూపర్‌ లీగ్‌ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్‌ 13వ జట్టు.

టోర్నీ ఫార్మాట్‌
వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో (ఇంకా కటాఫ్‌ తేదీ ఖరారు కాలేదు) ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి.

తర్వాత ఏమిటి...
పాయింట్లపరంగా టాప్‌–7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్‌ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్‌ టాప్‌–7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్‌ దక్కుతుంది.

మిగిలిన జట్లు ఏం చేస్తాయి...
నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్‌ జట్లతో కలిసి వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్‌–2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్‌ జరుగుతుంది.

మూడో కంటికే ‘నోబాల్‌’
వన్డేలు, టి20ల్లో ఫీల్డ్‌ అంపైర్ల పాత్రను మరింత తగ్గించే దిశగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరో అడుగు వేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌లను పర్యవేక్షించే అ«ధికారం పూర్తిగా థర్డ్‌ అంపైర్లకే అప్పజెప్పారు. సాధారణంగా ఫీల్డ్‌ అంపైర్లే నో బాల్‌ను ప్రకటిస్తారు. అయితే కొన్నాళ్ల క్రితం భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌లో అదనంగా మూడో అంపైర్‌ కూడా ఒక కన్నేసి ఉంచేలా ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

సాంకేతికంగా అది సరైనదిగా అనిపించడంతో ఇప్పుడు పూర్తిగా ‘మూడో కంటి’కే ఈ నిర్ణయాధికారం కట్టబెట్టారు. ఇకపై ఫీల్డ్‌ అంపైర్లు ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ ప్రకటించడానికి వీల్లేదు. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్‌ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్‌ ఆలస్యమైతే ఒక పాయింట్‌ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు