David Miller Birthday: 'కిల్లర్‌' మిల్లర్‌ అనగానే ఆ ఎపిక్‌ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం

10 Jun, 2022 17:34 IST|Sakshi

సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ ఇవాళ(జూన్‌ 10న) 33వ పుట్టిరోజు జరుపుకుంటున్నాడు. కిల్లర్‌ మిల్లర్‌గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్‌ లేటు వయసులో అదరగొడుతున్నాడు. అయితే మిల్లర్‌ అనగానే గుర్తుకువచ్చేది 2015 వన్డే వరల్డ్‌కప్‌లో అతనిచ్చిన ఎపిక్‌ ఎంట్రీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంది. ఆ వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌ రావడానికి సిద్ధమైన మిల్లర్‌ స్ట్రెయిట్‌గా కాకుండా బౌండీరీ లైన్‌పై నుంచి డైవ్‌ చేస్తూ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం ఆసక్తి కలిగించింది.

దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిల్లర్‌ను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌తో పోలుస్తూ.. మిల్లర్‌లో ఈరోజు క్రికెటర్‌ కాకుండా రెజ్లింగ్‌ స్టార్‌ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే మిల్లర్‌ ఇలా ఎందుకు చేశాడా అన్నది తెలియనప్పటికి.. బహుశా తొందరగా గ్రౌండ్‌లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటాడని క్రికెట్‌ కామెంటేటర్స్‌ సహా అభిమానులు అప్పట్లో చెవులు కొరుక్కున్నారు. ఇప్పటికి మిల్లర్‌ అనగానే టక్కున గుర్తుకువచ్చేది ఆ ఎపిక్‌ ఎంట్రీనే. 

ఇక మిల్లర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. మిల్లర్‌ జట్టులోకి వచ్చే సమయానికి దక్షిణాఫ్రికాలో చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. అది 2015 వన్డే వరల్డ్‌ కప్‌.

ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరడంలో మిల్లర్‌ పాత్ర చాలా కీలకమనే చెప్పొచ్చు. ఆ వరల్డ్‌కప్‌లో మిల్లర్‌ 324 పరుగులు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో మిల్లర్‌, జేపీ డుమినితో కలిసి ఐదో వికెట్‌కు 256 పరుగులు జోడించాడు. వన్డే చరిత్రలో ఐదో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా మిల్లర్‌, డుమినీ పేరిట ఉన్న రికార్డు ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రెగ్యులర్‌ సభ్యుడిగా ప్రమోషన్‌ పొందిన మిల్లర్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా మారాడు.

ఇక గురువారం రాత్రి టీమిండియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా.. ఏ మాత్రం బెదరకుండా డుసెన్‌తో కలిసి జట్టును గెలిపించాడు. అంతకముందు ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ గెలవడంలోనూ మిల్లర్‌ది కీలకపాత్రే. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మిల్లర్ సౌతాఫ్రికా తరపున 143 వన్డేల్లో 3503 పరుగులు, 96 టి20ల్లో 1850 పరుగులు సాధించాడు.

చదవండి:  ఐపీఎల్‌లో దుమ్ము లేపాడు.. ఇక్కడా అదరగొట్టాడు! మొత్తంగా 235 క్యాచ్‌లు!

మరిన్ని వార్తలు