IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!

31 Mar, 2023 10:52 IST|Sakshi
అహ్మదాబాద్‌ పిచ్‌

ఐపీఎల్‌(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్‌ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్‌ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్‌ మీటర్‌ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం​ ఐపీఎల్‌లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

అర్థం కాని పిచ్‌ల కారణంగా టి20 క్రికెట్‌లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టి20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టి20 మ్యాచ్‌ను కాస్త టి10 మ్యాచ్‌లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తింది. 

నిజానికి అహ్మదాబాద్‌ పిచ్‌ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్‌లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్‌ మాత్రమే కాదు.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది. అయితే క్యురేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్‌లు రూపొందించనట్లు పేర్కొంటున్నారు.అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్‌ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు.

చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. 

>
మరిన్ని వార్తలు