Virat Kohli: విరాట్‌ కోహ్లి కెరీర్‌కు 13 ఏళ్లు.. వింతలు, విశేషాలు

18 Aug, 2021 11:35 IST|Sakshi

Virat Kohli.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు. ఈ 13 ఏళ్లలో విరాట్‌ కోహ్లి సాధించిన ఘనతలు లెక్కలేనన్ని. విరాట్‌ కోహ్లి 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.  అయితే తొలి వన్డేలో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచిన కోహ్లి 14 మ్యాచ్‌ల తర్వాత తొలి శతకాన్ని సాధించాడు. అప్పటినుంచి సాగుతున్న పరుగుల ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే కోహ్లికి ''మిషన్‌ గన్‌'' అని ముద్దుపేరు కూడా ఉంది. టీమిండియా తరపున 254 వన్డేల్లో 12,169 పరుగులు.. 94 టెస్టుల్లో 7,609 పరుగులు.. 90 టీ20ల్లో 3,159 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 43 సెంచరీలు.. టెస్టుల్లో 27 సెంచరీలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలకు( వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్‌గా కొనసాగుతున్న కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ 13 ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

2008లో అరంగేట్రం చేసిన విరాట్‌ కోహ్లి 2011 వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు.
2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000,10వేల పరుగులు వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడిగా కోహ్లి
విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా
ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు
2013లో విరాట్‌ కోహ్లి తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానం అందుకున్నాడు.
ఒక టీ20 మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఔట్‌ చేయడం ద్వారా కోహ్లి తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు.  
2016లో తండ్రి చనిపోయిన రోజునే ఆయన గుర్తుగా రంజీ మ్యాచ్‌ ఆడిన కోహ్లి బ్యాటింగ్‌లో 90 పరుగులు చేశాడు.
2012లో 10 ఉత్తమ దుస్తులు ధరించిన అంతర్జాతీయ పురుషులలో విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో నిలిచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రశంసలు అందుకున్నాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి
వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లి దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి లీగ్‌లో అందరికళ్లా ఎక్కువ పారితోషికం(దాదాపు రూ.17 కోట్లు) తీసుకుంటున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టెస్టు క్రికెట్‌లో 63 మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.

కోహ్లి 13 ఏళ్ల కెరీర్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విటర్‌లో ప్రస్తుతం ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. ఒక లుక్కేయండి.. 

 


 


 


 


 


 

మరిన్ని వార్తలు