బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్‌ ది బెస్ట్‌

4 Feb, 2021 16:28 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ఒక విషయం ఆసక్తి రేపుతుంది. అదేంటో తెలుసా.. ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. చదవండి: టీమిండియాకు జో రూట్‌ వార్నింగ్‌

కాగా రేపు ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌తో బుమ్రా స్వదేశంలో తొలి టెస్టు ఆడడం ప్రత్యేకతను సంతరించుకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్‌ చూపిన బుమ్రా టెస్టులో తన ముద్రను ఎలా వేయనున్నాడనేది తేలిపోనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫోటోను షేర్‌ చేస్తూ ఐసీసీ ఒక ట్వీట్‌ చేసింది. 17 మ్యాచ్‌ల్లోనే 79 వికెట్లు తీసిన బుమ్రా ఇండియాలో తొలి టెస్టు ఆడనున్నాడా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ ఎమోజీని పెట్టింది. కాగా ఆసీసీతో జరిగిన మూడోటెస్టులో గాయపడిన బుమ్రా గబ్బాలో జరిగిన నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా,షమీ లాంటి సీనియర్‌ బౌలర్ల గైర్హాజరీలో టీమిండియా ఆఖరి టెస్టు మ్యాచ్‌ను గెలిచి 2-1 తేడాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ గెలుచుకుంది.

మరిన్ని వార్తలు