Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్‌ నుంచి స్టార్‌ క్రికెటర్‌ దాకా

25 Sep, 2022 10:50 IST|Sakshi

భారత మహిళా క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్‌ తర్వాత భారత మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా జులన్‌ గోస్వామి గుర్తింపు పొందింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని తన భుజాలపై మోసింది. జనవరి 6, 2002లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జులన్‌ గోస్వామి.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్‌పై తన చివరి మ్యాచ్‌ ఆడడం విశేషం. క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు అందుకున్న ఆమె జీవితం ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం

పశ్చిమబెంగాలోని నదియా జిల్లా చక్డా.. జులన్ సొంత గ్రామం. చక్డా నుంచి కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న జులన్.. చిన్నప్పుడు స్కూల్లో, తన ఉరిలో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్‌కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అని అవమానించినప్పటికి క్రికెట్‌ ఆడాలనే తన పట్టుదలను మాత్రం విడవలేదు. 

బాల్‌గర్ల్‌ నుంచి క్రికెటర్‌ దాకా
అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో.  ఆ ఏడాది కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో జులన్‌ గోస్వామి బాల్ గర్ల్‌గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. 'భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..' అని మనసులో నిశ్చయించుకుంది.  అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు.  అయితే ఆమె నివసిస్తున్న చక్డాలో, నదియాలో క్రికెట్ అకాడమీలు లేవు.  క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే 80 కిమీ ఆవల ఉన్న కోల్‌కతాకు వెళ్లాల్సిందే.  అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది. 

19 ఏండ్ల వయసులో జులన్‌ గోస్వామి 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేకపోవడంతో అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో  అతి సాధారణ  వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్‌లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్. 

లెక్కకు మించి రికార్డులు
భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ జులన్‌ పేరిటే ఉంది.  తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.  ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.  జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే..

►వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్. 
►జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు,  వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్. 
►మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43 


►ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు)  రెండో క్రికెటర్. 
►అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది.  న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది. 
►2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ  ఒక టెస్టులో పది వికెట్ల (78-10)  ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్. 

చదవండి: 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి..

జులన్‌కు క్లీన్‌స్వీప్‌ కానుక

మరిన్ని వార్తలు