Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’

3 Aug, 2022 07:45 IST|Sakshi

సాధారణంగానైతే కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం... అదీ స్వర్ణం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. కానీ లాన్‌ బౌల్స్‌ ఆట గురించే అరుదుగా తెలిసిన దేశంలో అందులోని క్రీడాకారుల గురించి అంతకంటే ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అసలు ప్రాచుర్యం పొందని ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం ఉంటే ఇప్పుడు అదే క్రీడలో కామన్వెల్త్‌ క్రీడల పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. సగటు క్రీడాభిమాని భాషలో... ‘ఆట గురించైతే పూర్తిగా తెలీయదు, కానీ ఫలితం చూస్తే ఆనందం మాత్రం వేసింది’ అనడం సరిగ్గా సరిపోతుందేమో!
–సాక్షి క్రీడా విభాగం  

లాన్‌ బౌల్స్‌ స్వర్ణం గెలిచిన నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు. గాయాల కారణంగా లవ్లీ, నయన్‌మోని కెరీర్‌లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్‌ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్‌ లాన్‌ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్‌ గేమ్‌ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్‌ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్‌ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం  కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే కొనసాగింది. 

మన దేశంలో లాన్‌ బౌల్స్‌ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్‌ లేకపోవడంతో పాటు బౌల్స్‌ కూడా  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించాల్సి  ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్‌ అంపైర్‌ అయిన మధుకాంత్‌ పాఠక్‌ వీరందరికీ కోచింగ్‌ ఇచ్చారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్‌ గ్రాస్‌పై ప్రాక్టీస్‌ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్‌ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్‌ రిసార్ట్‌లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు.  

వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో పెయిర్స్‌ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి ‘ట్రిపుల్స్‌’ ఆడగా క్వార్టర్‌ ఫైనల్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్‌మోని కలిసి రాగా నలుగురి బృందం ‘ఫోర్స్‌’లో గోల్డ్‌వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు.

గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది. నలుగురితో పాటు దశాబ్దకాలంగా జట్టు మేనేజర్‌గా ఉన్న అంజు లుత్రా పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. తన కుమార్తెలవంటి వీరితో సుదీర్ఘ కాలంగా సాగించిన ప్రయాణం తర్వాత దక్కిన ఈ పతకం ఆమెనూ భావోద్వేగానికి గురి చేసింది. ఒక రకంగా వీరందరికీ కామన్వెల్త్‌ క్రీడలు చావో, రేవోగా మారాయి. ఎవరూ పట్టించుకోని ఆటలో ఇంకో పరాజయం అంటే ఇక కెరీర్‌లు ముగిసినట్లే అని భావించారు. ఇప్పటి వరకు ఎంతో కొంత సహకారం అందించివారు కూడా సహజంగానే వెనక్కి తగ్గుతారు. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కచ్చితంగా వారితో పాటు ఆటను కూడా ఒక మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు.  

లవ్లీ చౌబే: వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, పోలీస్‌ కానిస్టేబుల్, జార్ఖండ్‌ 
పింకీ: 41 ఏళ్లు, మాజీ క్రికెటర్, పీఈటీ, ఢిల్లీ 
రూపా రాణి టిర్కీ: 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జిల్లా క్రీడాధికారి, జార్ఖండ్‌ 
నయన్‌మోని సైకియా: 33 ఏళ్లు, మాజీ వెయిట్‌లిఫ్టర్, అటవీ అధికారి, అసోం 

చదవండి: Commonwealth Games 2022: బౌల్స్‌లో బంగారం... టీటీలో పసిడి

Emma McKeon: కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్‌ స్విమ్మర్‌

మరిన్ని వార్తలు