Yash Dhull: యశ్‌ ధుల్‌ ఒక సంచలనం.. కోహ్లితో ఉ‍న్న పోలికేంటి!

4 Feb, 2022 18:20 IST|Sakshi

''అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సభ్యుడిగా ఉంటేనే ఒక బంపర్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు.. కెరీర్‌కు మేజర్‌ స్టార్ట్‌ దొరికినట్లేనని అంతా అంటారు.. మరి అలాంటిది అదే అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా నువ్వు ఉంటే.. ఇక నీ పేరు క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతుంది.''.. అండర్‌-19 పెను సంచలనం.. యశ్‌ ధుల్‌కు తన చిన్ననాటి కోచ్‌ చెప్పిన మాటలివి..

ఈ మాటలను నిజం చేయడానికి యశ్‌ ధుల్‌ ఒక్క అడుగుదూరంలో ఉ‍న్నాడు. శనివారం టీమిండియా ఇంగ్లండ్‌తో ఫైనల్‌లో అమితుమీ తేల్చుకోనుంది. ఐదో టైటిల్‌పై కన్నేసిన టీమిండియా కళను యశ్‌ ధుల్‌ తీర్చనున్నాడా అనేది తేలిపోనుంది. మరి అలాంటి యశ్‌ ధుల్‌ ఎక్కడి నుంచి వచ్చాడు.. క్రికెట్‌లోకి ఎలా అడుగుపెట్టాడు అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.  

జనవరి 19,2022.. అండర్‌-19 ప్రపంచకప్‌ ప్రారంభమై అప్పటికి ఐదు రోజులు కావొస్తుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇంతలో జట్టును కరోనా కుదుపేసింది. టీమిండియా కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ సహా కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇది యశ్‌ ధుల్‌ను బాగా భయపెట్టింది. టీమిండియా అండర్‌-19లో ఐదో ప్రపంచకప్‌ టైటిల్‌ అందివ్వాలనుకున్న కోరిక నెరవేరదేమోనని అనుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో తన చిన్ననాటి కోచ్‌ రాజేష్‌ నగర్‌ గుర్తొచ్చారు. వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. నగర్‌ ఒక్కటే విషయం చెప్పారు.. భయపడకు.. కంట్రోల్‌లో ఉంటే అన్ని కంట్రోల్‌లోనే ఉంటాయి'' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు.

చదవండి: Yash Dhull: యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

కోచ్‌ నగర్‌ మాటలు యశ్‌ ధుల్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఐసోలేషన్‌లో ఉ‍న్న యశ్‌ ధుల్‌ మూడో రోజు నుంచే తను ఉన్న రూమ్‌లోనే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాడు. దాన్నంతా ఒక కెమెరాలో బంధించి తర్వాత రీప్లే చేసుకొని షాట్ల ఎంపికను చూసుకునేవాడు. ఆ తర్వాత కోచ్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌కు తన వీడియోలను పంపించి బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ అడిగేవాడు. ఇదంతా చూసిన లక్ష్మణ్‌.. యశ్‌ ధుల్‌ నీ పోరాట పటిమ అద్భుతం.. ఇండియా ఎలెవెన్‌లో కెప్టెన్‌ ఆర్మ్‌బాండ్‌ ధరించి మ్యాచ్‌లు ఆడతావు రెడీగా ఉండు.. అని చెప్పాడు. 

అన్నట్లే యశ్‌ ధుల్‌  బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయానికి కోలుకొని మళ్లీ అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఒక చరిత్ర. కష్టాల్లో పడిన టీమిండియాను షేక్‌ రషీద్‌ సాయంతో.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన యశ్‌ ధుల్‌ సూపర్‌సెంచరీతో మెరిశాడు. 96 పరుగులుతో విజయం సాధించిన భారత్‌ ఎనిమిదోసారి ఫైనల్లో అడగుపెట్టింది. టీమిండియాకు అండర్‌-19 ప్రపంచకప్‌ అందించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.

చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్‌ హిట్టు ఇన్నింగ్స్‌

పదేళ్ల వయసు నుంచే..
యశ్‌ ధుల్‌ చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. తన పదేళ్ల వయసు నుంచే క్రికెట్‌పై దృష్టి పెట్టిన యశ్‌ధుల్‌ అండర్‌-19లో టీమిండియాకు కప్‌ అందించాలని కోరుకున్నాడు. అలా ద్వారకాలోని బాల్‌ భవన్‌ స్కూల్‌లో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆరో తరగతి వచ్చిన తర్వాత కోచ్‌ రాజేశ్‌ నగర్‌ యశ్‌కు పరిచయమయ్యాడు. అప్పటినుంచి అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఒక నెల వ్యవధిలోనే 15 మ్యాచ్‌లు ఆడి సూపర్‌ ఫామ్‌ను కొనసాగించి మంచి రన్స్‌ సాధించాడు. కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఇతను 2వేల మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కనిపిస్తున్నాడని కొందరు కోచ్‌లు మెచ్చుకున్నారు.  ఆ తర్వాత అండర్‌-19 కేటగిరిలో శ్రీలంక, నేపాల్‌, మలేషియాలో కీలక టోర్నీలు ఆడాడు. 15 ఏళ్ల వయసులో నేపాల్‌లో జరిగిన అండర్‌-19 టోర్నమెంట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును గెలుచుకొని అందరి దృష్టిలో పడ్డాడు. అయితే యశ్ ధుల్‌ 16 ఏళ్లకే ఇంత పేరు తెచ్చుకోవడం వెనుక కోహ్లి కూడా ఒక కారణమని అతని కోచ్‌ నగర్‌ ఒక సందర్భంలో పేర్కొన్నారు.

కోహ్లితో అనుబంధం.. అతనితో పోలిక
''ఢిల్లీలో యశ్‌ ధుల్‌ ఇంటికి.. కోహ్లి ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. కోహ్లి ఆటను దగ్గరుండి గమనించిన యశ్‌ ధుల్‌ అతన్నే అనుకరించడం మొదలుపెట్టాడు. అండర్‌-19 జ​ట్టులో మూడోస్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చే యశ్‌ ధుల్‌ అచ్చం కోహ్లిని తలపిస్తున్నాడు. ఒక వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఎలా ఆడాలో కోహ్లి నుంచే నేర్చుకున్నాడు. కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ఎలా అయితే స్టార్ట్‌ చేస్తాడో.. అచ్చం అదే మాదిరి యశ్‌ధుల్‌ కూడా సింగిల్స్‌, డబుల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఓపెనర్లు ఔటైతే.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు ఎంత కీలకమో తెలుసుకున్నాడు. యశ్‌ ధుల్‌ కోహ్లి టెక్నిక్‌ను అందుకోలేకపోవచ్చు.. కానీ అతనిలా మాత్రం ఇన్నింగ్స్‌లు నిర్మించగలడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక అండర్‌-19 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు యశ్‌ ధుల్‌ బాగా కష్టపడ్డాడు. సెప్టెంబర్‌- అక్టోబర్‌ 2021లో జరిగిన వినూ మాన్కడ్‌ ట్రోఫీలో యశ్‌ ధుల్‌ సూపర్‌ ప్రదర్శన చేశాడు. ఆ ట్రోఫీలో ఢిల్లీ గ్రూప్‌ స్టేజీ దాటకపోయినప్పటికి యశ్‌ మాత్రం 302 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాకు ఐదో టైటిల్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని కోరిక నెరవేరి త్వరలోనే టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాలని ఆశిద్దాం.

చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్‌స్టార్లు

>
మరిన్ని వార్తలు