Ashleigh Barty: యాష్లే బార్టీ.. మనకు తెలియని యాంగిల్‌ ఏంటంటే

29 Jan, 2022 22:16 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2022 టైటిల్‌ను యాష్లే బార్టీ తొలిసారి గెలిచిన సంగతి తెలిసిందే. డానియెల్‌ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం చేసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ బార్టీ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ కావడం విశేషం. ఇక యూఎస్‌ ఓపెన్‌ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేసుకోనుంది. కాగా 2021 ఏడాదిని నెంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించిన బార్టీ.. స్టెఫీ గ్రాఫ్‌, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్‌, క్రిస్‌ ఎవర్ట్‌ సరసన నిలిచింది. 

చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు

బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్‌..


ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్‌ ఒకటి దాగుంది. అదేంటో తెలుసా 2015లో కొన్ని రోజులు బిగ్‌బాష్‌ లీగ్‌లో క్రికెట్‌ ఆడింది. బార్టీ వుమెన్స్‌ క్రికెటర్‌గా మారడానికి ఒక కారణం ఉంది. 2014 యూఎస్‌ ఓపెన్‌ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్‌లాండ్‌ ఫైర్‌కు క్రికెట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్‌కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్‌లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్‌ సబరబ్స్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్‌ వుమెన్స్‌ ప్రీమియర్‌ టి20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది.

చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్‌ ఆలోచన.. కట్‌చేస్తే

బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరపున..


భారత్‌తో ఐపీఎల్‌ ఎంత పాపులరో.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో బిగ్‌బాష్‌ లీగ్‌కు అంతే ప్రాధాన్యముంది. వెస్ర్టన్‌ సబ్‌రబ్స్‌ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ బ్రిస్బేన్‌ హీట్‌ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్‌లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది.

ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్‌ వేదికగా రోలాండ్‌ గారోస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మరిన్ని వార్తలు