T20 WC 2022: ఇంగ్లండ్‌ గెలుపులో మూల స్తంభాలు..

14 Nov, 2022 07:42 IST|Sakshi

‘లెట్‌ ఇట్‌ హర్ట్‌...’ ఐర్లాండ్‌ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత తన సహచరులకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఇ ఏకవాక్య సందేశం ఇది. ఏమీ పర్వాలేదు, గెలుపోటములు ఆటలో భాగం అనే రొటీన్‌ మాటలు చెప్పి అతను తమ పరాజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయలేదు. ‘ఈ ఓటమి మనల్ని బాధించనివ్వండి.

ప్రతీ క్షణం గుర్తు చేసుకుంటేనే తర్వాతి మ్యాచ్‌లు గెలవాలన్న కసి పెరుగుతుంది’ అని బట్లర్‌ చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. దాంతో ముందంజ వేయడంపై మరోసారి సందేహాలు! అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లలో సత్తా చాటుతూ కివీస్, శ్రీలంకపై విజయాలతో సెమీస్, ఆపై భారత్‌పై ఘన విజయంతో ఫైనల్లో చోటు. ఇక తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యంతో టైటిల్‌ సొంతం. 
- సాక్షి క్రీడా విభాగం 

ఇంగ్లండ్‌ టైటిల్‌ విజయంలో ప్రధాన ఆటగాళ్లందరి పాత్ర ఉంది. కీలక సమయాల్లో వీరంతా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఓపెనర్లుగా బట్లర్‌ (225 పరుగులు), హేల్స్‌ (212 పరుగులు) అదీ దాదాపు 150 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడంతో ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం సాధించేందుకు వీలు కలిగింది. వీరిద్దరు కలిసి టోర్నీలో 6 మ్యాచ్‌లలోనే 43 ఫోర్లు, 17 సిక్సర్లు బాదడం విశేషం. మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనిపించినా ఓపెనర్లు ఇచ్చిన పునాదులపైనే ఇంగ్లండ్‌ విజయయాత్ర సాగిందనడం అతిశయోక్తి కాదు.

‘బిగ్‌ గేమ్‌–బిగ్‌ మ్యాన్‌’ అంటూ గుర్తింపు తెచ్చుకున్న బెన్‌ స్టోక్స్‌ నిజంగా ఈ టోర్నీలో జట్టుకు మూలస్థంభంలా నిలిచాడు. టోర్నీకి ముందు టి20 టీమ్‌లో అతని స్థానంపై విమర్శలు వచ్చాయి. అయితే బ్యాటింగ్‌ అవసరమైతే బ్యాటింగ్‌తో, బౌలింగ్‌ అవసరమైతే బౌలింగ్‌తో అతను సత్తా చాటాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో, ఫైనల్‌లో అతను పట్టుదలగా నిలబడి ఉండకపోతే ఫలితాలు భిన్నంగా ఉండేవేమో! కొత్త బంతితో కేవలం 6.79 ఎకానమీతో అతను తీసిన 6 కీలక వికెట్లు ఇంగ్లండ్‌ను ముందుకు నడిపించాయి. బౌలింగ్‌లో స్యామ్‌ కరన్‌ చూపిన ప్రతిభ అసాధారణం.

గత ఏడాది గాయంతో వరల్డ్‌ కప్‌కు దూరమై కామెంటేటర్‌గా మైదానంలో కనిపించిన అతను ఏడాదిలోగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అతను తీసిన 13 వికెట్లలో ప్రతీది విలువైందే. ముఖ్యంగా ఫైనల్లో ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది. కరన్‌కు తోడుగా లెగ్‌స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ముద్ర కూడా టోరీ్నపై ఎంతో ఉంది.

రషీద్‌ ఆటను చూసినప్పుడల్లా భారత అభిమానులు చహల్‌తో ఒక్క మ్యాచ్‌ కూడా ఎందుకు ఆడించలేదు అని బాధపడటం సహజం! 6.12 ఎకానమీతో అతను ప్రత్యర్థులను కట్టి పడేశాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ మెయిడిన్‌ వేయడం అంటే సాధారణ విషయం కాదు. అదీ బాబర్‌ ఆజమ్‌ వికెట్‌తో రావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. మార్క్‌ వుడ్‌ తన పదునైన పేస్‌తో 4 మ్యాచుల్లోనే 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. 

2015 వన్డే వరల్డ్‌ కప్‌లో చిత్తయిన తర్వాత ఆట, రాత మార్చుకున్న ఇంగ్లండ్‌ మోర్గాన్‌ నాయకత్వంలో పదును తేలింది. విధ్వంసక జట్టుగా తయారై 2019లో విశ్వ విజేతగా నిలిచింది. మోర్గాన్‌ జట్టుకు కొత్త దశ, దిశను చూపించినవాడిగా నిలిచాడు. ఇప్పుడు సరైన సమయంలో మోర్గాన్‌ తప్పుకొని బట్లర్‌కు పగ్గాలు అప్పగించాడు. కొత్త కెప్టెన్సీలో కొన్ని కొత్త మొహాలు వచ్చాయంతే...జట్టు దృక్పథం మాత్రం మారలేదు.

అదే దూకుడు, అవసరమైతే 11వ నంబర్‌ ఆటగాడు కూడా సిక్స్‌లు కొట్టేందుకు సిద్ధంగా ఉండటం, జట్టులో సగం మంది ఆల్‌రౌండర్లు ఒక విభాగంలో విఫలమైతే, రెండో విభాగంలో సత్తా చాటుకోవడం... ఇవన్నీ జట్టులో అంతర్భాగంగా మారిపోయాయి. ఫలితంగానే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుసగా రెండో ప్రపంచకప్‌  ఇంగ్లండ్‌ ఇంటికి చేరింది.  

మరిన్ని వార్తలు