Bhavinaben Patel: పారాలింపిక్స్‌లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ..

29 Aug, 2021 08:51 IST|Sakshi

Bhavina Patel Wins Silver Medal: తొందరపడితే చరిత్రను తిరగరాయలేం.. ఊరికే చరిత్రను సృష్టించలేం.. ఇదొక బ్లాక్‌ బస్టర్‌ సినిమా డైలాగ్‌. అయితే నిజ జీవితంలోనూ ఇది అక్షర సత్యమని నిరూపించింది భవీనాబెన్‌ పటేల్‌. టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్‌ పటేల్‌..  అందుకోసం పడ్డ కష్టం, గెలుపు కోసం పడ్డ తాపత్రయం ఎందరికో స్ఫూర్తిదాయకం కూడా.. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్ మహిళ క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో చేరినప్పుడే ఆమెకు పతకం ఖాయమైనప్పటికీ శనివారం జరిగిన సెమీస్‌ పోరులో గెలిచిన భవీనా ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారు పతకాన్ని గెలిచే అవకాశం వచ్చింది.

అయితే తుది పోరులో చైనా క్రీడాకారిణి.. ప్రపంచ నెంబర్‌వన్‌.. చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌ పటేల్‌ జీవితం ఒక ఆదర్శం. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ఒడిదుడుకులతో  విజయాలు సాధించింది.  

చదవండి: Tokyo Paralympics: భవీనాబెన్‌ పటేల్‌కు రజతం

పోలియో బారిన పడి...
గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు.


ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్‌ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్‌ లలన్‌ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్‌ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది.


ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్‌ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్‌ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్‌ నికుంజ్‌ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్‌ విభాగంలో రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఆమె సాధించిన విజయానికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు