Rafael Nadal Unknown Facts: ఫుట్‌బాలర్‌ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు

3 Jun, 2022 11:12 IST|Sakshi

టెన్నిస్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. ఆటలో అతనికి ఎదురులేదు.. కోర్టులో అతను బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు హడల్‌.. అందరూ అతన్ని క్లేకోర్టు రారాజుగా అభివర్ణిస్తారు. టెన్నిస్‌ ఓపెన్‌ శకం మొదలైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు కొల్లగొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సాధించిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాబితా తీస్తే అందులోనూ అగ్రస్థానం అతనిదే.

తన తరంలోనే పుట్టిన మరో ఇద్దరు గ్రెటేస్ట్‌ ఆటగాళ్లను దాటి మరీ.. మరో గ్రాండ్‌స్లామ్‌ దక్కించుకోవడం కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో.. ది గ్రేట్‌ రాఫెల్‌ నాదల్‌. నాదల్‌ ఇవాళ 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఫుట్‌బాలర్‌ కావాల్సిన వ్యక్తి ఈరోజు టెన్నిస్‌ ప్రపంచాన్ని రారాజులా ఏలుతున్నాడు. హ్యాపీ బర్త్‌డే నాదల్‌..

పవర్‌గేమ్‌కు పెట్టింది పేరు రాఫెల్‌ నాదల్‌. ఫుట్‌బాలర్‌ కావాల్సిన నాదల్‌ తన అంకుల్‌ ప్రోత్సాహంతో రాకెట్‌ చేతబట్టాడు.. టెన్నిస్‌ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. స్పెయిన్‌లోని మానకోర్‌లో అనా మారియా, సెబాస్టియన్‌ నాదల్‌ దంపతులకు 1986 జూన్‌ 3న రాఫెల్‌ నాదల్‌ జన్మించాడు. నాదల్‌ బాబాయిలు ఇద్దరు(మిగ్యూల్‌ నాదల్‌, టోనీ నాదల్‌) ఫుట్‌బాల్‌ ఆటలో పేరు సంపాదించారు. తొలుత నాదల్‌ను కూడా ఫుట్‌బాలర్‌గానే చూడాలనుకున్నారు. కానీ నాదల్‌ చిన్న బాబాయి టోనీ నాదల్‌ను మూడేళ్ల వయసులోనే ప్రతిభను గుర్తించాడు.

తమలా ఫుట్‌బాలర్‌ కాకుండా టెన్నిస్‌ బ్యాట్‌ చేతపడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. టోనీ నాదల్‌.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. నాదల్‌ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాబాయితోనే గడిపేవాడు. ప్రతీరోజు ఎర్రమట్టిలో గంటల తరబడి నాదల్‌ చేత ప్రాక్టీస్‌ చేయించేవాడు. అతని కోసం ఎర్రమట్టిని అత్యంత కఠిన పరిస్థితులను సృష్టించి మరీ నాదల్‌కు శిక్షణ ఇచ్చేవాడు. నాదల్‌ ఆ శిక్షణ తట్టుకోలేక ఒక సందర్భంలో తన తల్లికి ఫిర్యాదు చేశాడు. కానీ బాబాయి టోనీ మాత్రం నాదల్‌ను టెన్నిస్‌ రారాజులా చూడాలనుకుంటున్నానని నాదల్‌ తల్లికి ముందే చెప్పాడు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చిన్ననాటి నుంచే ఎర్రమట్టిలో కఠోర సాధన చేశాడు గనుకనే నాదల్‌ ఇవాళ క్లేకోర్టుకు రారాజు అయ్యాడు. ఒక రకంగా నాదల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే.

బాబాయి కఠిన శిక్షణలో అండర్‌-12 టైటిల్‌ సాధించేశాడు. ఆ తర్వాత 14 ఏళ్లకే స్పానిష్‌ జూనియర్‌ సర్క్యూట్‌లో రఫాకు మంచి పేరు వచ్చింది. ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో అప్పటికే టెన్నిస్‌లో టాప్‌ ఆటగాడిగా ఉన్న కార్లోస్‌ మోయాను ఓడించి సంచలనం సృష్టించాడు రాఫెల్‌ నాదల్‌. అప్పటికి నాదల్‌ వయస్సు 14 ఏళ్లే. ఈ సంచలనం అక్కడితో ఆగలేదు. 2001లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడిగా నాదల్‌ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మరుసటి ఏడాది జరిగిన వింబుల్డన్‌లో సెమీఫైనల్‌ చేరి అందరి  దృష్టిని ఆకర్షించాడు.

18 ఏళ్ల వయసులో డేవిస్‌ కప్‌లో అప్పటి వరల్డ్‌ నెంబర్‌-2 ఆండ్రీ అగస్సీని ఓడించి ఔరా అనిపించాడు. అక్కడి నుంచి నాదల్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తన ఆటను మాత్రం అంతే పట్టుదలతో కొసాగించాడు.. కొనసాగిస్తున్నాడు. ఇక తన కాలంలోనే మరో టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌కు ధీటుగా మారాడు. 2005 నుంచి రోజర్‌  ఫెదరర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన నాదల్‌ 2006 నుంచి 2009లోపూ ఐదు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఓడించి  సంచలనం సృష్టించాడు.  

ఆటను ఎంత ప్రేమించాడో.. కుటంబాన్ని అంతే..
ఆటను ఎంత ప్రేమించాడో కుటుంబాన్ని అంతే ప్రేమించాడు నాదల్‌. తల్లిదండ్రులంటే అమితంగా ఇష్టపడే నాదల్‌కు 2009లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనస్పర్థల కారణంగా నాదల్‌ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది నాదల్‌ను మానసికంగానూ.. కెరీర్‌ పరంగానూ చాలా దెబ్బ తీసింది. ఎంతలా అంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఓటమి ఎరుగని రారాజుగా వెలుగొందుతున్న నాదల్‌కు తొలి ఓటమి అదే సంవత్సరం వచ్చింది. ఆ ఏడాది ఫైనల్లో రోజర్‌ ఫెదరర్‌ నాదల్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. అయితే ఈ భాద నాదల్‌ను ఎంతోకాలం ఆపలేకపోయింది.

గోడకు కొట్టిన బంతిలా..
2010లో మళ్లీ ఫుంజుకున్న నాదల్‌ ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌లను కొల్లగొట్టి పూర్వ వైభవం సాధించాడు. ఆటలో చాంపియన్‌గా నిలిచిన నాదల్‌కు అదే ఏడాది విడిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికి అంతా సాఫీగానే సాగింది. అయితే గత నాలుగేళ్లలో వయసు మీద పడడం.. ఆటలో ఏకాగ్రత తగ్గడం.. గాయాలు వేదించడంతో .. నాదల్‌ పని అయిపోయిందని అంతా భావించారు. దీనికి తోడూ రోజర్‌  ఫెదరర్‌, జొకోవిచ్‌లు ఆటలో దూసుకుపోతున్నారు. వీటన్నింటికి నాదల్‌ ఒకే ఒ‍క్క గ్రాండ్‌స్లామ్‌తో సమాధానమిచ్చాడు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌తో  జరిగిన సుధీర్ఘ పోరులో నాదల్‌ ఓటమి అంచుల వరకు వెళ్లి విజేతగా నిలిచాడు. అలా కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ అందుకొని ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక తనకు అచ్చొచ్చిన రోలాండ్‌ గారోస్‌(ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ) నాదల్‌ దూసుకెళుతున్నాడు. 36వ పుట్టిరోజు జరుపుకుంటున్న రోజునే అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో సెమీ ఫైనల్లో తలపడుతున్నాడు. 22వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ముగిద్దాం. ముగించేముందు నాదల్‌కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు..

నాదల్‌ గురించి మనకు తెలియని కొన్ని ముఖ్య విషయాలు
►నాదల్‌ 2019, అక్టోబర్‌ 19న మారియా ఫ్రాన్సియా పెరెల్లోతో వివాహం జరిగింది.
►నాదల్‌ రెండు చేతులతో ఆడగలడు. అతను ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. రెండు చేతులతో టూహ్యాండెడ్‌ ఫోర్‌షాట్‌ కూడా ఆడగల సామర్థ్యం ఉంది.
►రాఫెల్‌ నాదల్‌కు చీకటంటే చచ్చేంత భయం. నిద్రపోతున్న సమయంలో ఒక లైటు లేదా టీవీ స్క్రీన్‌ వెలుగుతూనే ఉంటుంది.
►ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడే సమయంలో నాదల్‌ లాకర్‌ నెంబర్‌ 159 మాత్రమే తీసుకుంటాడు.
►ప్రతీ మ్యాచ్‌కు ముందు చన్నీటితో స్నానం చేయడం నాదల్‌కు అలవాటు
►నాదల్‌ ఏ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్న నోటితో కొరకడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నానో తనకు తెలియదని.. ఒకసారి కొరకడం అలవాటయ్యాకా దానికి మానలేకపోయానని ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.
►టెన్నిస్‌ కోర్టులో నాదల్‌ తాగే వాటర్‌ బాటిల్స్‌ వరుస క్రమంలో ఉంటేనే తాగుతాడు. అలా లేకుంటే వాటిని సరిచేసి గానీ నీళ్లు తాగడు.​ 

మరిన్ని వార్తలు