FIFA WC 2022: మ్యాచ్‌ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?

5 Dec, 2022 19:40 IST|Sakshi

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన కెరీర్‌లో చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడుతున్నాడని చాలామంది భావిస్తున్నారు. 35 ఏళ్ల వయసులో ఉన్న మెస్సీ మరో వరల్డ్‌కప్‌ ఆడడం అనుమానమే. అందుకే కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను, రికార్డులను అందుకున్నప్పటికి ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందుకోలేదన్న కోరిక మెస్సీకి బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు హ్యాపీ మూమెంట్‌తో ఆటకు వీడ్కోలు పలకాలని మెస్సీ భావిస్తున్నాడు.

అందుకు తగ్గట్టుగానే మెస్సీ ప్రయాణం కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి మినహా.. క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకు అంతా సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇప్పటివరకు మెస్సీ మూడు గోల్స్‌ కొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం నాకౌట్‌ దశ జరుగుతుండడంతో ప్రతీ మ్యాచ్ కీలకమే.. అర్జెంటీనా ఓడితే మాత్రం ఇంటిబాట పట్టడమే కాదు మెస్సీ కెరీర్‌ కూడా ముగిసినట్లే. డిసెంబర్‌ 10న బలమైన నెదర్లాండ్స్‌తో అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో మెస్సీ సేన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాలని బలంగా కోరుకుందాం.

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా లియోనల్‌ మెస్సీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఫుట్‌బాల్‌ అంటే బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఆటగాళ్లు పరిగెత్తుతూనే ఉండాలి.. అయితే మెస్సీ మాత్రం బంతి తన ఆధీనంలో లేనప్పుడు పరిగెత్తడం కంటే ఎక్కువగా నడవడం చేస్తుంటాడని ఒక వెబ్‌సైట్‌ తన సర్వేలో పేర్కొంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్‌ దశలో మ్యాచ్‌ సమయంలో గ్రౌండ్‌లో ఎక్కువగా నడిచిన టాప్‌-10 ఆటగాళ్ల లిస్ట్‌ రూపొందించారు.

ఈ లిస్ట్‌లో మెస్సీ మూడుసార్లు చోటు దక్కించుకోవడం విశేషం. మెక్సికోతో మ్యాచ్‌లో మెస్సీ అత్యధికంగా 4998 మీటర్లు దూరం నడిచాడు. ఆ తర్వాత పోలాండ్‌తో మ్యాచ్‌లో 4736 మీటర్ల దూరం, సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో 4627 మీటర్ల దూరం నడిచాడు. ఓవరాల్‌ జాబితాలో రెండు, ఐదు, తొమ్మిదో స్థానాలు కలిపి మొత్తంగా మూడుసార్లు మెస్సీ చోటు దక్కించుకున్నాడు.

ఇక తొలి స్థానంలో పోలాండ్‌ కెప్టెన్‌ రాబర్ట్‌ లెవాన్‌డోస్కీ ఉన్నాడు. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో రాబర్ట్‌ 5202 మీటర్ల దూరం నడిచాడు. ఆ తర్వాత అర్జెంటీనాతో మ్యాచ్‌లో 4829 మీటర్ల దూరం నడిచిన లెవాన్‌డోస్కీ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి రెండోసారి చోటు సంపాదించాడు.

మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?
మరి మ్యాచ్‌లో మెస్సీ పరిగెత్తడం కంటే ఎక్కువగా నడుస్తాడనే దానిపై సందేహం వచ్చింది. ఈ ప్రశ్నకు మెస్సీ మాజీ మేనేజర్‌ పెప్‌ గార్డియోలా సమాధానం ఇచ్చాడు. ''మెస్సీ నడవడంలోనే పరిగెత్తడం చేస్తుంటాడు. అతను గేమ్‌లో ఎంతలా ఇన్వాల్వ్‌ అయితాడనేదానికి అతని నడకే ఒక ఉదాహరణ. మెస్సీ కావాలని అలా నడవడు. మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక పది నిమిషాల పాటు గ్రౌండ్‌ మొత్తం నడుస్తూనే తన జట్టు ఆటగాళ్ల కదలికలను.. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారనే దానిపై ఒక కన్ను వేస్తాడు. గ్రౌండ్‌ పరిసరాలను మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికే ఈ ప్రయత్నం.

ఆ తర్వాత తలను ఎడమ, కుడి.. ఇలా 360 డిగ్రీస్‌లో తిప్పుతూ ఆటగాడి కదలికలను.. వారు కొట్టే షాట్స్‌ను అంచనా వేయడం అతనికి అలవాటు.  ఇక అంతా బాగుంది అనుకొని అప్పుడు తనలోని ఆటను బయటికి తీయడం చేస్తుంటాడు. మెస్సీ సక్సెస్‌కు ఇదీ ఒక కారణం అని చెప్పొచ్చు. అంతేకాని ఏదైనా సమస్య కారణంగా మెస్సీ పరిగెత్తడం లేదని.. నడకకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే. మెస్సీలో ఉన్న ప్రత్యేకత ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్‌ కోసం చకోర పక్షుల్లా

FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!

మరిన్ని వార్తలు