‘కెప్టెన్సీలో ట్రిక్స్‌ చేయలేకపోయాడు’

10 Aug, 2020 17:25 IST|Sakshi

కరాచీ: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి చెందడం పట్ల మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కంటే పాకిస్తాన్‌ అన్ని విధాలా బాగా ఆడినా అవసరమైన సందర్భంలో రాణించలేకపోవడం వల్లే విజయం సాధింలేకపోయిందన్నాడు. ప్రధానంగా అజహర్‌ అలీ కెప్టెన్సీని ఇంజీ వేలెత్తిచూపాడు. అజహర్‌ కొన్ని ప్రయోగాలు చేయకపోవడం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌ను పరాజయంతో ముగించాల్సి వచ్చిందన్నాడు.

ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో రెండొందల పరుగులలోపే ఆలౌట్‌ చేస్తుందనుకుంటే చివరకు గెలుపును వారికి అందించడం నిరాశను మిగిల్చిందన్నాడు. తన యూట్యూబ్‌ చానల్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్తాన్‌ ఓటమిని ఇంజీ విశ్లేషించాడు. ‘ నా ప్రకారం చూస్తే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్‌ అవుతుందని అనుకున్నా. కానీ మా కెప్టెన్‌ అజహర్‌ అలీ చేసిన తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఇచ్చాం. కనీసం షార్ట్‌ బాల్స్‌ను కూడా ఎక్కడా ప్రయోగించలేదు. ఇంగ్లండ్‌ విజయానికి కారకులైన బట్లర్‌, వోక్స్‌లు షార్ట్‌ పిచ్‌ బంతుల్ని ఆడలేరు. ఈ ప్రయోగం చేయలేదు. అజహర్‌ అలీ కెప్టెన్‌గా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇంగ్లండ్‌ కంటే పాకిస్తాన్‌ బలంగా ఉంది’ అని ఇంజీ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌(75) , వోక్స్ ‌(84)లు కీలక పాత్ర పోషించారు.(బట్లర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో?)

మరిన్ని వార్తలు