ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత

27 Aug, 2021 12:18 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శనపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్‌లు దీనికి బాధ్యులని.. ముందు వారిద్దరు బ్యాటింగ్‌ బాగా చేస్తే బాగుంటుదంటూ చురకలంటించాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఇంజమామ్‌ మాట్లాడుతూ..'' టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. వారి బ్యాటింగ్‌ శైలి నాసిరకంగా తయారైంది. తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా బ్యాటింగ్‌ అంత ఆసక్తికరంగా ఏం కనిపించలేదు. కోహ్లి, రోహిత్‌ శర్మలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. నా దృష్టిలో వారిద్దరు బాగా బ్యాటింగ్‌ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 105 బంతులాడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్‌ కాస్త స్ట్రోక్‌ప్లేతో షాట్లు ఆడితే టాపార్డర్‌, మిడిలార్డ్రర్‌కు ధైర్యంగా ఉండేది.

చదవండి: మ్యాచ్‌ జరుగుతుండగా విరాట్‌ కోహ్లి ఫోటో ప్రత్యక్షం

ఇక విరాట్‌ కోహ్లి ప్రదర్శన మరింత దారుణంగా తయారైంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు.  లీడ్స్‌ టెస్టులోనూ కోహ్లి అదే ప్రదర్శనను చేశాడు. 31 బంతులాడి కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వీరిద్దరు మాత్రమే కాదు జట్టులో ఉన్న మిగిలిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా, రహానేలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టీమిండియా పతనాన్ని శాసిస్తున్నాడు. టెస్టు సిరీస్‌ ఆరంభం నుంచి అండర్సన్‌ మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. టీమిండియా బ్యాటింగ్‌ ఇలాగే కొనసాగితే మ్యాచ్‌ నాలుగురోజుల్లో ముగిసే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు.

ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా 78 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లను ఉతికారేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. జో రూట్‌ అద్భుత సెంచరీతో మెరవగా.. డేవిడ్‌ మలాన్‌ అర్థ సెంచరీతో రాణించాడు. ఇప్పటికే 345 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. 

చదవండి: T20 Cricket: టి20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. చరిత్రలో తొలి బౌలర్‌గా

మరిన్ని వార్తలు