WFI: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

20 Jan, 2023 21:45 IST|Sakshi

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్‌ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్‌ పొగాట్‌, భజరంగ్‌ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ)కు లేఖ రాశారు.

తాజగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్‌ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్‌ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్‌, యోగేశ్వర్‌ దత్‌, సహదేవ్‌ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్‌లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు.

చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్‌?! 

ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ

మరిన్ని వార్తలు