ఒలింపిక్స్‌ జరగడం ఖాయం: ఐఓసీ

8 Sep, 2020 09:04 IST|Sakshi

టోక్యో: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా సంవత్సరంపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను 2021లో ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్‌ జరగాల్సి ఉంది. ఆలోగా కరోనా పూర్తిగా తగ్గకపోయినా, దీనికి సంబంధించి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా తాము మాత్రం వెనక్కి తగ్గమని ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్‌ కోట్స్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌–19ను గెలిచిన క్రీడలుగా టోక్యో ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌)

‘కరోనా అంతమైనా, కాకపోయినా ఒలింపిక్స్‌ మాత్రం జరుగుతాయి. 2011లో సునామీ ముంచెత్తిన తర్వాతే జపాన్‌ ఒలింపిక్స్‌ కోసం ముందడుగు వేసింది. దేశాన్ని పునర్నిర్మించుకుంది. ఇప్పుడు కోవిడ్‌–19ను గెలవడంలో కూడా ఒలింపిక్‌ క్రీడలు స్ఫూర్తిగా నిలుస్తాయి. అవి కారు చీకట్లో కాంతిరేఖవంటివి. కోవిడ్‌కు ముందు పరిస్థితిని చూస్తే జపాన్‌ గతంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుత సన్నాహాలు చేసింది. ఏడాది వాయిదా కారణంగా స్పాన్సర్‌షిప్, ప్రసారహక్కులు, హోటల్స్‌ వసతి... ఇలా చాలా అంశాల్లో మళ్లీ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కష్టమే అయినా జపాన్‌ ప్రభుత్వం కాడి పడేయలేదు. 2021 కోసం మళ్లీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితి ఎలా ఉన్నా 206 దేశాల అథ్లెట్లు పాల్గొనడం మాత్రం ఖాయం’ అని కోట్స్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు