‘యూఏఈలో ఐపీఎల్‌.. ఆర్సీబీకే ఛాన్స్‌’

23 Jul, 2020 16:36 IST|Sakshi

ముంబై : వరల్డ్ కప్‌ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో సెప్టెంబర్, అక్టోబర్‌, నవంబర్‌లలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐపీఎల్ గవర్నింగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పారు. ఈ నేపథ్యంలో తటస్థ వేదిక అయిన యూఏఈలో, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి విజయావకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహిస్తే ఆర్సీబీకే ఎక్కువ లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. తన యూట్యూబ్‌ ఛానల్లో పలు విషయాలను మాట్లాడుతూ.. మిగతా జట్ల కంటే బౌలింగ్ విభాగం ఎక్కువ బలహీనంగా ఉన్న ఆర్సీబీ అక్కడ బాగా రాణించే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పాడు.  చాహల్, పవన్ నేగి యూఏఈలో కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది అన్నాడు. (చలో దుబాయ్@ ఐపీఎల్‌-2020)

‘ఈ పన్నెండేళ్లలో ఏం జరిగిందో అందరూ దాన్ని మర్చిపోవాలి. ఒకవేళ యూఏఈలో ఐపీఎల్ జరిగితే ఏ టీమ్‌కు కూడా మరింత లాభం చేకూరే అవకాశం లేదు. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడితే హోం సపోర్ట్‌ ఉండదు. పిచ్‌లు కూడా ఒకే తీరులో ఉండవు. ప్రతి టీమ్ ఒకేలా ప్రారంభించాలి. ముంబై, చెన్నై లాంటి టాప్ క్లాస్‌ టీమ్స్‌ మొదట్లో వెనుకపడినా అవి త్వరగా పుంజుకుంటాయి. యూఏఈలో వేడి ఎక్కువ. మైదానాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది బ్యాట్స్‌మెన్‌కు బాగా కలిసొచ్చే అంశం. దీంతో బ్యాటింగ్ బలంగా ఉండి.. బౌలింగ్ వీక్‌గా ఉన్న ఆర్సీబీ లాంటి జట్లకు వారి బౌలింగ్ లోపాలు ఎక్కువగా బయటపడవు. అలాగే మంచి స్పిన్నర్లు ఉన్న చెన్నై, పంజాబ్ జట్లకు అక్కడి పెద్ద గ్రౌండ్లు కలిసివస్తాయి’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.(‘ధోనీపై గంగూలీ మాటలు ఇంకా గుర్తున్నాయి..’)

‘ఐపీఎల్ యూఏఈలో జరగడం వల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. కాకపోతే అక్కడి వాతావరణం పరిస్థితులను తట్టుకోవడమే కొంచం కష్టం. యూఏఈ వాతావారణం పరిస్థితులు ఆటగాళ్ళకు సవాలుగా మారొచ్చు. అక్కడి వేడి తట్టుకోవడం కష్టమే. కానీ సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో వాతావరణం కొంత చల్లగానే ఉంటుంది. సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితులలో ఈవెంట్ తొందరగా ముగించాలంటే రోజుకు రెండు మ్యాచ్‌లు నిర్వహించక తప్పదు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

మరిన్ని వార్తలు