అది నీ మైండ్‌సెట్‌ని సూచిస్తుంది: గంభీర్‌

31 Oct, 2020 13:13 IST|Sakshi

దినేశ్‌ కార్తిక్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన గంభీర్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథ్య బాధ్యతల నుంచి అర్థంతరంగా వైదొలిగిన దినేష్‌ కార్తీక్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ విమర్శలు సంధించాడు. బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకే, ఇయాన్‌ మోర్గాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించానన్న డీకే అందులోనూ సఫలం కాలేదని చురకలు అంటించాడు. డీకే అనాలోచిత నిర్ణయం అతడి మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించాడు. కాగా గురువారం నాటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు లక్ష్యాన్ని విధించగా.. 6 వికెట్ల తేడాతో చెన్నై విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్‌ ప్లేఆఫ్‌ ఆశలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. (చదవండి: హార్స్‌మాన్‌ అద్భుత బ్యాటింగ్‌: రవిశాస్త్రి)

ఈ సీజన్‌లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... ప్లే ఆఫ్స్‌ చేరేందుకు అరకొర అవకాశాలు మాత్రమే ఉండటంతో జట్టు ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌.కామ్‌తో మాట్లాడిన కేకేఆర్‌ మాజీ సారథి గంభీర్‌.. ‘‘బ్యాటింగ్‌ మీద దృష్టి పెట్టాలని భావించి నువ్వు కెప్టెన్సీని వదిలేశాం. కానీ అది వర్కవుట్‌ కాలేదు. ఇది నీ మైండ్‌సెట్‌ను సూచిస్తోంది. ఒక్కోసారి బాధ్యతలు భుజాన మోయడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి. 2014లో.. అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో నాకు ఈ విషయం బోధపడింది. 

టోర్నమెంట్‌ ఆరంభంలో వరుసగా మూడుసార్లు నేను డకౌట్‌ అయ్యాను. అప్పుడు కెప్టెన్‌గా ఉండటం వల్లే తిరిగి నన్ను నేను రుజువు చేసుకోగలిగాను. ఫాంలోకి వచ్చాను. నిజానికి బ్యాటింగ్‌లో విఫలమైన సమయంలో, నేను జట్టు కూర్పుపై దృష్టి సారించాను. విజయావకాశాలను నిర్ణయించే అంశాలపై ఫోకస్‌ చేశాను. తద్వారా మంచి ఫలితాలు రాబట్టగలిగాను. అలా కాకుండా కెప్టెన్సీని వదిలేసి, కేవలం బ్యాటింగ్‌పై దృష్టిసారిస్తే.. ఫోకస్‌ అంతా అటువైపే ఉంటుంది. మరి జట్టు సంగతేమిటి’’అంటూ దినేశ్‌ కార్తిక్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. (చదవండి: ఐపీఎల్‌: క్రిస్‌ గేల్‌కు షాక్)‌

అప్పుడు గంభీర్‌ కూడా
కాగా దినేశ్‌ కార్తిక్‌ రెండన్నరేళ్లుగా కేకేఆర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్‌ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఆ తర్వాత ఢిల్లీ జట్టు బాధ్యతలు చేపట్టిన గంభీర్‌.. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు 2018లో ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతేగాక జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జట్టు యాజమాన్యం తన కోసం వెచ్చించిన 2.8 కోట్ల రూపాయలని కూడా తీసుకోకూడదని అతడు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘‘కెప్టెన్సీ విషయంలో మీకొక రూల్‌, డీకేకు ఒక రూల్‌ ఉంటుందా గంభీర్‌.. సమాధానం చెప్పండి’’ అంటూ దినేశ్‌ కార్తిక్‌ ఫ్యాన్స్‌ అతడిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆటకు స్వస్తి పలికి రాజకీయాల్లో ప్రవేశించిన గంభీర్‌, బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఇక గంభీర్‌ స్థానంలో ఆనాడు సారథిగా ఎంపికైన యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఢిల్లీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 

మరిన్ని వార్తలు