ఆరు బంతులు.. ఆరు రకాలుగా

8 Sep, 2020 16:07 IST|Sakshi

దుబాయ్‌ : జస్‌ప్రీత్‌ బుమ్రా.. వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌కు పెట్టింది పేరు. మలింగ తర్వాత యార్కర్ల వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సెస్టెంబర్‌ 19న చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. (చదవండి : పంత్‌.. సిక్సర్ల మోత!)

ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ సమయంలో  బుమ్రా ఆరు బంతులను ఆరు రకాలుగా సంధించాడు. ఫన్నీ మూమెంట్‌లో సాగిన ప్రాక్టీస్‌లో బుమ్రా..  ప్రతి బాల్‌ను ఇతర బౌలర్లకు సంబంధించిన యాక్షన్‌ను ఇమిటేట్‌ చేస్తూ ఆరు బంతులును వేశాడు. బుమ్రా వేసినవాటిలో మాజీ బౌలర్‌తో పాటు ప్రస్తుత బౌలర్లకు సంబంధించిన బౌలింగ్‌ యాక్షన్స్‌ ఉన్నాయి. ఈ వీడియోను ముంబై తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. బుమ్రా వేసిన ఆరు బంతులు ఎవరిని ఇమిటేట్‌ చేస్తూ సంధించాడో చెప్పగలరా అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ముంబై ఇండియన్స్‌ షేర్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషలల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మునాఫ్‌ పటేల్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, మిచెల్‌ స్టార్క్‌, కేదార్‌ జాదవ్‌, శ్రేయాస్‌ గోపాల్‌, అనిల్‌ కుంబ్లే బౌలింగ్‌ యాక్షన్‌ను బుమ్రా అనుకరించాడంటూ ఎక్కువ మంది అభిమానులు కామెంట్స్‌ చేశారు. మరికొందరు మాత్రం లసిత్‌ మలింగ, షేన్‌ వార్న్‌లను ఇమిటేట్‌ చేసినట్లు పేర్కొన్నారు. బుమ్రా నీలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అంటూ జోకులు పేల్చారు. 

మరోవైపు వ్యక్తిగత కారణాల రిత్యా ఐపీఎల్‌ 2020 నుంచి తప్పుకుంటున్నట్లు యార్కర్‌ కింగ్‌, స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో బుమ్రా ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర వహించనున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుమ్రా ఏ విధంగా బౌలింగ్‌ చేస్తాడో వేచి చూద్దాం. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా 82 వికెట్లు పడగొట్టాడు. 

మరిన్ని వార్తలు