కేఎల్‌ రాహుల్ కెప్టెన్సీపై న‌మ్మ‌కం ఉంది

5 Sep, 2020 10:46 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్‌గా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను సమ‌ర్థంగా న‌డిపించే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని ఆ జ‌ట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయ‌ప‌‌డ్డాడు.  2019లో పంజాబ్ జట్టును నడిపించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. దీంతో కింగ్స్ యాజ‌మాన్యం కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సెస్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు ఇప్ప‌టికే కింగ్స్ ఎలెవెన్ త‌న ప్రాక్టీస్‌ను కూడా ఆరంభించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై త‌నకు అపార‌మైన న‌మ్మ‌కముంద‌ని..టీమిండియాకు ఆడిన అనుభ‌వం అత‌న్ని కెప్టెన్ అయ్యేలా చేసింద‌ని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. కుంబ్లే వీడియోను కింగ్స్ పంజాబ్ త‌న ట్విట‌ర్లో షేర్ చేసింది.

'కేఎల్  రాహుల్  ప్ర‌శాంతంగా ఉంటాడు..  ఆట‌లో ఎంతో  నేర్పును ప్ర‌ద‌ర్శిస్తాడు. చాలా రోజుల నుంచే రాహుల్ అతి ద‌గ్గ‌రినుంచి గ‌మ‌నిస్తూ వ‌చ్చాను. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభ‌వంతో పాటు కొన్ని సంవ‌త్స‌రాలుగా అత‌ను కింగ్స్ జ‌ట్టుతో పాటే కొన‌సాగుతున్నాడు. కెప్టెన్‌గా అత‌నికి ఇది ఎంతో లాభ‌దాయ‌కం. కింగ్స్ జ‌ట్టుకు సంబంధించి బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు రాహుల్‌కు ఈ పాటికే అర్థ‌మ‌యిఉంటాయి. అందుకే కెప్టెన్‌గా, బ్యాట్స్‌మ‌న్‌గా, వికెట్ కీపర్‌గా త‌న వంతు పాత్రను స‌మ‌ర్థంగా పోషించ‌గ‌ల‌డు.

ఈసారి లీగ్ దుబాయ్‌లో జ‌రుగుతుండ‌డం కొంత ఇబ్బందే అయినా.. జ‌ట్టుగా మాత్రం బ్యాలెన్సింగ్‌తో ఉంది. సీనియ‌ర్లు, జూనియ‌ర్లతో క‌లిసి జ‌ట్టు స‌మ‌తూకంగా ఉంది. ఈసారి మా జ‌ట్టుపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఒక కోచ్‌గా నా బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తాన‌నే న‌మ్మ‌కం నాకు ఉంది.' అంటూ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా కుంబ్లే  గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్ర‌ధాన కోచ్‌గా ఎంపిక అయ్యాడు. 
చ‌ద‌వండి : 
మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్‌ 
చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు