69 పరుగులు‌: ధావన్‌పై నెటిజన్ల ఫైర్‌!

12 Oct, 2020 14:29 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఇక లక్ష్యఛేధనకు దిగిన ముంబై తొలుత మందకొడిగానే ఆట ప్రారంభించినా, డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుగ్గా రాణించడంతో 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న ఢిల్లీని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా ఆదివారం నాటి ఓటమి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానులు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా మెరుగైన స్కోరే చేసినప్పటికీ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మార్కస్‌ స్టోయినిస్‌ విషయంలో  తప్పు చేశాడంటూ మండిపడుతున్నారు. ఈ ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ బదులు ధావన్‌ ఔటైనా బాగుండేదంటూ అసహనం వెళ్లగక్కుతున్నారు.(చదవండి: ముంబై మళ్లీ మురిసె...)

ఇంతకీ విషయమేమిటంటే.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్‌ వేసిన 16వ ఓవర్లో ధావన్‌ ఒకటి, స్టొయినిస్‌ 2 ఫోర్లు కొట్టడంతో 16 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్‌ ఇదే. అయితే ఆ తర్వాత ఓవర్‌లో రాహుల్‌ చహర్‌ వేసిన మూడో బంతి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాంగ్‌ ఆన్‌ దిశగా బంతిని బాదిన స్టోయినిస్‌ రన్‌ తీశాడు. అయితే లాంగ్‌- ఆన్‌ బౌండరీ వద్ద ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కాస్త తడబడినా ఆఖరికి బంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ అప్పటికే ధావన్‌ మరో రన్‌ కోసం మార్కస్‌కు పిలుపునివ్వగా, అతడు క్రీజ్‌ వీడాడు. (చదవండి: ఖలీల్‌పై రాహుల్‌ తెవాటియా ఫైర్‌ !)

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సూర్యకుమార్‌ విసిరిన బంతిని చేతుల్లోకి తీసుకున్న రాహుల్‌ వికెట్ల మీదకు విసిరి, స్టొయినిస్‌ను రనౌట్‌ చేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న స్టోయినిస్‌ అసహనంగానే పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక ఈ టోర్నీ ఆరంభం నుంచి మెరుగ్గా రాణిస్తున్న స్టోయినిస్‌ క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, అతడు కనీసం మరో 20 పరుగులైనా చేసేవాడంటూ ఢిల్లీ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్‌ నుంచి తమను నిరాశపరుస్తున్న ధావన్‌, ఇప్పుడు కూడా వన్డే తరహా బ్యాటింగ్‌తో చిరాకు తెప్పించాడని, జట్టుకు భారంగా మారాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  (చదవండి: ‘కేదార్‌ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’)

మరిన్ని వార్తలు