ఆర్‌ఆర్‌ వర్సెస్‌ కేకేఆర్‌ : చెరో 10 విజయాలు

30 Sep, 2020 19:03 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 12వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా నేడు రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి. లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాజస్తాన్‌ను కోల్‌కతా ఏ మేరకు నిలవరిస్తుందనేది చూడాలి. కాగా రాజస్తాన్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఏంచుకుంది.

ఇరు జట్ల బలాబలాలు :
సంజూ శామ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, తెవాటియా, జోస్‌ బట్లర్‌, ఊతప్ప, టామ్‌ కరన్‌ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌ విభాగం అత్యంత బలంగా కనిపిస్తుంది. ఎంత పెద్ద లక్ష్యం కళ్లు ముందు ఉన్నా ఏ మాత్రం బెదరకుండా చేధిస్తూ టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200లకు పైగా పరుగులు సాధించిన జట్టుగా రాజస్తాన్‌ జట్టు నిలిచింది. ముఖ్యంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కళ్ల ముందు బారీ లక్ష్యం కనబడుతున్నా చేధనలో ఆది నుంచి దాటిగా ఆడుతూ చివర్లో తెవాటియా మెరుపులతో 226 పరుగుల విజయలక్ష్యాన్ని ఊదేసింది. ఇక బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ తప్ప పేరున్న బౌలర్‌ లేకపోవడంతో బౌలింగ్‌ విభాగం కాస్త బలహీనంగానే ఉంది. అయితే బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉండడంతో అది బయటపడలేదు. (చదవండి : 'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు')

మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక విజయం, ఒక ఓటమితో కొనసాగుతుంది. శుబ్‌మన్‌ గిల్‌  మినహా మిగతావారు పెద్దగా రాణించకపోవడం జట్టుకు కష్టంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆండ్రీ రసెల్‌ ఇంకా బ్యాట్‌కు పనిచెప్పడం లేదు.. ఓపెనర్‌గా వస్తున్న సునీల్‌ నరైన్‌ ఏమాత్రం సక్సెస్‌ కావడం లేదు. దినేష్‌ కార్తిక్‌ కెప్టెన్సీ బాగానే ఉన్నా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన కమిన్స్‌ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. 

ఇక ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రాజస్తాన్‌ 10, కేకేఆర్‌ 10 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్తాన్‌పై కేకేఆర్‌ అత్యధిక స్కోరు 190, అత్యల్ప స్కోరు 125గా ఉంది. కాగా కేకేఆర్‌పై రాజస్తాన్‌ అత్యధిక స్కోరు 199 పరుగులు, అత్యల్ప స్కోరు 81గా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 

కేకేఆర్‌ తుది జట్టు : 
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), సునీల్‌ నరైన్‌, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, శివం మావి

రాజస్తాన్‌ తుదిజట్టు :
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, రాబిన్‌ ఊతప్ప, సంజూ శాంసన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, రియాన్‌ పరాగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరాన్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, జయదేవ్‌ ఉనాద్కత్

మరిన్ని వార్తలు