ఇంతకూ నీ బాస్‌ ఎవరు!?

11 Nov, 2020 12:25 IST|Sakshi

దుబాయ్‌: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఒడిదుల మధ్య మొదలైన ఐపీఎల్‌ 13వ సీజన్‌ దిగ్విజయంగా ముగిసింది. కోవిడ్‌ వైరస్‌ భయపెడుతున్నా కట్టుదిట్టమైన సంరక్షణా చర్యలతో తాజా సీజన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆటగాళ్ల ఆరోగ్యానికి ఇబ్బందులు రాకుండా ఐపీఎల్‌ నిర్వాహకులు, బీసీసీఐ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్‌ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రీడా విశ్లేషకులు బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులకు అభినందనలు చెప్తున్నారు. అసాధ్యమనుకున్న టోర్నీ నిర్వహణను చేసి చూపించారని కొనియాడుతున్నారు. అయితే, ఈ విషయంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి చేసిన ఓ పొరపాటుతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. 

ఢిల్లీతో ఫైనల్‌ పోరులో ముంబై విజయం అనంతరం ట్వీట్‌ చేసిన రవిశాస్త్రి ఐపీఎల్‌ నిర్వాహుకులకు, వైద్య సహాయకులకు కంగ్రాట్స్‌ చెప్పాడు. సాధ్యం కాదనుకున్న ఐపీఎల్‌ 2020 టోర్నీని సుసాధ్యం చేశారని కొనియాడాడు. బీసీసీఐ పెద్దలకు, ఐపీఎల్‌ చీఫ్‌కు థాంక్స్‌ చెప్పాడు. కానీ, బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీని పేరును మరిచాడు. దీంతో అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు. ‘నీ బాస్‌ ఎవరు?’అని ప్రశ్నిస్తున్నారు. 

కాగా, ఏప్రిల్‌-మే నెలల్లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌ 13 వ సీజన్‌.. పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే, కరోనాతో ఇళ్లకే పరిమితమై బందీలుగా బతుకున్న జనాలకు క్రికెట్‌ అనుభూతి అవసరమని బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ భావించాడు. స్వదేశంలో కాకుండా.. గల్ఫ్‌ దేశాల్లో ఐపీఎల్‌ నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించి.. దుబాయ్‌లో టోర్నీ నిర్వహణకు ఓకే చెప్పాడు. ఇక బీసీసీఐ, ఐపీఎల్‌ సిబ్బంది, అన్ని జట్ల ఆటగాళ్ల క్రమశిక్షణతోనే టోర్నీ విజయవంతమైందని సౌరవ్‌ గంగూలీ ఓ జాతీయ మీడియాతో అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు