రవీంద్ర జడేజాపై రవిశాస్త్రి ప్రశంసలు

30 Oct, 2020 13:09 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసుకు దూరమైన తర్వాత చెన్పై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటలో పదును పెరిగింది. మొన్నటికి మొన్న ఆర్సీబీని చిత్తుగా ఓడించిన ధోని టీం.. నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో, మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... ప్లే ఆఫ్స్‌ చేరేందుకు అరకొర అవకాశాలు మాత్రమే ఉన్న నైట్‌రైడర్స్‌పై గెలుపొంది కోలుకోలేని దెబ్బతీసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌- రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌తో విజయాన్ని అందుకుంది. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు లక్ష్యాన్ని విధించగా.. 6 వికెట్ల తేడాతో చెన్నై విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: కోల్‌కతాకు చెన్నై దెబ్బ )

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రుత్‌రాజ్‌  (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా.. గెలుపునకు జట్టు 30 పరుగుల దూరంలో ఉన్న సమయంలో 29 రన్స్‌ చేసిన రవీంద్ర జడేజా అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలక సమయంలో జట్టును ఆదుకున్న ‘సర్‌’ జడేజాను సూపర్‌కింగ్స్‌ అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడావు అంటూ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సైతం జడేజా సూపర్‌ ఇన్నింగ్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. (చదవండికాస్త ఓపిక పట్టు సూర్య కుమార్‌: రవిశాస్త్రి)

‘‘చెలరేగిపోయి ఆడాడు. హార్స్‌మాన్‌ అద్భుత ప్రదర్శన చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ గుర్రం ముఖం ఎమోజీని ఇందుకు జతచేశాడు.  కాగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీ అంటే ఎంతటి మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో అనేకమార్లు ఈ విద్యలను ప్రదర్శించిన జడేజా, ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేయగా అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పరుగుల వేటలో గుర్రాన్ని దౌడు తీయించినట్లుగా చెలరేగి ఆడాడనే ఉద్దేశంలో రవిశాస్త్రి, జడేజాను హార్స్‌మాన్‌గా అభివర్ణించాడు.

మరిన్ని వార్తలు