పృథ్వీ షా.. నీ ప్ర‌తిభ అమోఘం

6 Sep, 2020 10:14 IST|Sakshi

దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజ‌న్ ఆరంభానికి ఇంకా 13 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండడంతో లీగ్‌లో పాల్గొంటున్న అన్ని జ‌ట్లు త‌మ ప్రాక్టీస్‌ను మ‌రింత ముమ్మ‌రం చేశాయి. ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా నేడు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఛైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ శ‌నివారం వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెన‌ర్ పృథ్వీ షా శ‌నివారం నెట్స్‌లో జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వ‌ర్యంలో క‌ఠోర సాధ‌న చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు మంచి ఫుట్‌వ‌ర్క్ కొన‌సాగిస్తూ బారీ షాట్ల‌ను ఆడాడు. (చ‌ద‌వండి : షెడ్యూల్‌ నేడే విడుదల)

పృథ్వీ షా ప్రాక్టీస్‌ను ద‌గ్గ‌ర్నుంచి గ‌మ‌నించిన పాంటింగ్ అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. పృథ్వీ షా ప్ర‌తిభ అమోఘం. అత‌ని ఫుట్‌వ‌ర్క్ అద్భుతంగా ఉంది. పేస‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ అతను కొడుతున్న ప్ర‌తీ షాట్‌లో మంచి టైమింగ్ క‌నిపిస్తుంది. ఈ సంద‌ర్భంగా పృథ్వీ ఆడిన ఒక షాట్‌ను.. 'నిజంగా అద్భుత‌మైన షాట్ ఆడావు .. వాట్ ఏ బ్యూటీ' అంటూ కామెంట్ చేశాడు.  ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేసుకుంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌గా పేరు మార్చుకున్న త‌ర్వాత 2019లో ఆ జ‌ట్టు ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్లేఆఫ్‌లో ఆడ‌డం విశేషం. శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలో స‌మ‌తూకంతో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు పాంటింగ్  ప్ర‌ధాన కోచ్‌గా ఈ సీజ‌న్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి. అయితే ఢిల్లీ జ‌ట్టుకు ఐపీఎల్ 2020లో క్రిస్ వోక్స్‌, జాస‌న్ రాయ్ లాంటి కీల‌క ఆట‌గాళ్ల‌ సేవ‌ల‌ను కోల్పోనుంది. కాగా గ‌త సీజ‌న్‌లో పృథ్వీ షా 16 మ్యాచ్‌ల్లో 353 పరుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

మరిన్ని వార్తలు