రోహిత్‌... తొందరపడకు!

4 Nov, 2020 12:48 IST|Sakshi

గాయాన్ని దృష్టిలో పెట్టుకో

బీసీసీఐ చీఫ్‌ గంగూలీ సూచన

గంగూలీ సలహాను లెక్కచేయని రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ: స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ కోసం తొందరపడొద్దని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సూచించాడు. తొడ కండరాల గాయంతో రోహిత్‌ వరుసగా నాలుగు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రోహిత్‌ గాయంతో ఉన్నందునే సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతి ఇచ్చింది. అయితే ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల కోసం రోహిత్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ముంబై ప్రాక్టీస్‌ సెషన్స్‌లో అతను శ్రమిస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన గంగూలీ స్పందించాడు. ఈ ఒక్క లీగ్‌ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించాడు. రోహిత్‌లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. ‘రోహిత్‌ గాయపడటం వల్లే ఆసీస్‌ పర్యటనకు పక్కన బెట్టాం. లేదంటే రోహిత్‌లాంటి ఆటగాడిని ఎంపిక చేయకుండా ఉంటామా? పైగా అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు భారత వైస్‌ కెప్టెన్‌. ముందుగా అతని గాయంపై అంచనా వేస్తాం. ఆ తర్వాతే కోలుకునేది ఎప్పుడనేది చెప్పగలం. మాక్కావాల్సింది అతను కోలుకోవడమే. రోహిత్‌లాంటి స్టార్‌ క్రికెటర్‌ను కాపాడుకోవడం, తిరిగి ఆడేలా చూసుకోవడమనేది పూర్తిగా బీసీసీఐ బాధ్యత. అతను కోలుకుంటే ఆడతాడు. ఇందులో సందేహాలు అక్కర్లేదు’ అని గంగూలీ అన్నాడు. (నాకైతే సంబంధం లేదు: రవిశాస్త్రి) 

ఇషాంత్‌ ఓకే....
భారత సీనియర్‌ స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మ కోలుకున్నాడని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కల్లా అతను జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఎన్‌సీఏలో ఇప్పటికే అతను తక్కువ రనప్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. సౌకర్యవంతంగా కొన్ని ఓవర్లు వేస్తున్నాడు. దీంతో ఆసీస్‌లో రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. చిన్న చిన్న గాయాలనేవి సహజం. కోవిడ్‌–19తో వచ్చిన విరామం కూడా కారణం. ఒక్కోసారి ఆటకు దూరంగా ఉన్నా... తక్కువగా ఆడినా ఎక్కువ గాయాలవుతాయి. అదే బిజీ షెడ్యూల్‌ను అనుసరించి ఆడుతుంటే శరీరం దృఢంగా తయారవుతుంది. గాయాలు తక్కువగా అవుతాయి’ అని గంగూలీ వివరించాడు.

ఐపీఎల్‌ ఆడి చూపిస్తా!
నాకు ఫిట్‌నెస్‌ లేదంటారా... అయితే ఐపీఎల్‌ ఆడి చూపిస్తా! భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ వ్యవహార శైలి తీరు సరిగ్గా ఇలాంటి అర్థాన్నే ఇస్తోంది. ఐపీఎల్‌ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సలహా ఇచ్చిన రోజే రోహిత్‌ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును ఎగతాళి చేశాడు! గాయంతో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌ మంగళవారం ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడాడు. టాస్‌ సమయంలో మాట్లాడుతూ...‘అంతా బాగుంది. నేను ఫిట్‌గా, చురుగ్గా కూడా ఉన్నాను’ అని రోహిత్‌ స్వయంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన అక్టోబర్‌ 26 నుంచి రోహిత్‌ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రోహిత్‌ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం దీనిని మరింతగా పెంచింది.

తాజాగా గంగూలీ... రోహిత్‌ కండరాల్లో చీలిక వచ్చిందని చెప్పాడు. కానీ అక్టోబర్‌ 23న ముంబై ఇండియన్స్‌ ఇచ్చిన ప్రకటనలో ‘కండరాలు పట్టేశాయి’ అని మాత్రమే ఉంది. మరి అది నిజమా, లేక గాయం ముదిరిందా అనేది తెలీదు. ఒకవేళ చీలిక ఉంటే మాత్రం ఇంత తొందరగా తగ్గదు. రోహిత్‌ బరిలోకి దిగే అవకాశమే లేదు. రోహిత్‌ను ఎంపిక చేయని రోజునుంచి ముంబై ఇండియన్స్, రోహిత్‌ ఏదో రూపంలో బోర్డుకు ఏదో నిరూపించాలనే ప్రయత్నిస్తున్నారు. టీమ్‌ సెలక్షన్‌ ముగిసిన తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో, కోచ్‌ రవిశాస్త్రి...రోహిత్‌ ఫిట్‌గా లేడని చెప్పిన రోజున మరో వీడియో, ఇప్పుడు గంగూలీ వ్యాఖ్య తర్వాత నేరుగా మ్యాచ్‌ బరిలోకి..! గాయం పెరిగితే భవిష్యత్తు కష్టమవుతుందని తెలిసినా రోహిత్‌ మొండిగా ఎందుకు ఆడుతున్నాడు. ఇప్పటికే లీగ్‌లో అగ్రస్థానం ఖరారైన తర్వాత... బౌల్ట్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన మ్యాచ్‌లో రోహిత్‌ అవసరం ఏముంది? ప్లే ఆఫ్స్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనే వాదన అర్థం లేనిది. రోహిత్‌ స్థాయి ఆటగాడు కొంత విరామం వచ్చినా, నేరుగా మ్యాచ్‌లో సత్తా చాటగలడు. మొత్తంగా తనను ఎంపిక చేయని బీసీసీఐకి తనవైపు నుంచి సందేశం వినిపించేందుకే రోహిత్‌ ఆడాడా అనేది ఆసక్తికరం.     
– సాక్షి క్రీడా విభాగం

>
మరిన్ని వార్తలు