వరుసగా మూడు అర్ధ సెంచరీలు

2 Nov, 2020 10:33 IST|Sakshi

ఈ మూడు సార్లూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’

చెన్నై ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఘనత

అబుబాది: ‘యువ విరాట్‌ కోహ్లిలా కన్పిస్తున్నాడు’... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు డుప్లెసిస్‌ ఇచ్చిన కితాబిది. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు మొదట్లో తడబడినా తర్వాత సత్తా చాటాడు. టోర్ని ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి బారిన పడినా కలవరపడకుండా కోలుకుని జట్టుకు వెన్నుముఖగా మారాడు. 0, 5, 0, 65 నాటౌట్, 72, 62 నాటౌట్‌... ఈ ఐపీఎల్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ స్కోర్లు. ప్రతిభావంతుడైన ఈ యువ ఆటగాడు ఐపీఎల్‌లో సత్తా చాటగలడని లీగ్‌ ఆరంభంలో అంతా అంచనా వేశారు. చివరకు టోర్నీ ముగిసే సమయానికి అతను దీనిని నిజం చేసి చూపించాడు.

మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల రుతురాజ్‌కు గత ఏడాదే చెన్నై జట్టులో చోటు లభించినా... తుది జట్టులో మాత్రం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. 2020 లీగ్‌ ఆరంభానికి ముందే అతను కోవిడ్‌ బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో కీలక సమయంలో బరిలోకి దిగి తొలి బంతికే స్టంపౌట్‌ అయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు డకౌట్లతో అతని ఆటపై సందేహాలు రేగాయి. అయితే తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లలో అతను తన సత్తా చూపించాడు. వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన తొలి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడిగా నిలిచాడు. ఈ మూడు సార్లూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అతను, తమ జట్టు తరఫున అత్యధిక సగటుతో సీజన్‌ను ముగించడం విశేషం. మరోవైపు రుతురాజ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిస్తున్నారు. మ్యాచ్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఎలా గెలిపించాలో చూపించాడని వీరేంద్ర సెహ్వాగ్‌ మెచ్చుకున్నాడు. (చదవండి: ఇదే ఆఖరి మ్యాచా.. ధోని పంచ్‌)

మరిన్ని వార్తలు