సాహా... వార్నర్‌... వహ్వా! 

28 Oct, 2020 01:55 IST|Sakshi
‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహా, వార్నర్‌

సన్‌రైజర్స్‌కు భారీ విజయం

88 పరుగులతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌

సాహా, వార్నర్‌ అర్ధసెంచరీలు

బౌలింగ్‌లో చెలరేగిన రషీద్‌ ఖాన్‌   

వార్నర్‌కు అసలైన పుట్టిన రోజు బహుమతి. ఐపీఎల్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చడంతో జట్టుకు భారీ విజయం దక్కింది... లీగ్‌లో తమ రెండో అత్యధిక స్కోరు సాధించిన అనంతరం పదునైన బౌలింగ్‌తో ఢిల్లీ పనిపట్టిన హైదరాబాద్‌ రన్‌రేట్‌లో కూడా దూసుకుపోయింది. మరోవైపు లీగ్‌ మొదలైన నాటి నుంచి వరుస విజయాలతో ఎక్కువ భాగం అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆ జట్టు ఖాతాలో ‘హ్యాట్రిక్‌’ పరాజయం చేరింది.

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో కీలక విజయం దక్కింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్‌ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. మనీశ్‌ పాండే (31 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (35 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్‌ ఖాన్‌ (3/7) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

కెప్టెన్‌ దూకుడు... 
తన పుట్టిన రోజైన మంగళవారం వార్నర్‌ చెలరేగిపోయాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో అతని జోరు మొదలైంది. తర్వాత నోర్జే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్‌... రబడ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 22 పరుగులు (4, 4, 0, 6, 4, 4) సాధించి వేడుక చేసుకున్నాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్‌ స్కోరు 77 పరుగులకు చేరింది. ఈ సీజన్‌లో ఏ జట్టుకైనా పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను, 2020 సీజన్‌లో ఆరు ఓవర్లకు ముందే ఈ మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 52 బంతుల్లోనే సన్‌రైజర్స్‌ 100 పరుగులు నమోదు చేసింది. అయితే కొద్ది సేపటికే అశ్విన్‌ ఓవర్లో ఫోర్‌ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వార్నర్‌ వెనుదిరిగాడు.  

మెరుపు ఇన్నింగ్స్‌... 
ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌ ఆడిన సాహా... ఈసారి ఓపెనర్‌ పాత్రలో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ప్రదర్శించిన అతను ఆ తర్వాత దూకుడు పెంచాడు. తుషార్‌ ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి 27 బంతుల్లోనే సాహా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఏ ఢిల్లీ బౌలర్‌నూ వదలకుండా బౌండరీలు బాదిన అతను, రబడ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌తో మిడ్‌ వికెట్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో తన రెండో సెంచరీకి చేరువవుతున్న తరుణంలో నోర్జే బౌలింగ్‌లో గాల్లోకి షాట్‌ ఆడి ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఒక చక్కటి ఇన్నింగ్స్‌ ముగిసింది.  సాహా వెనుదిరిగిన తర్వాత పాండే కూడా వేగంగానే ఆడినా, అప్పటి వరకు వచ్చిన స్కోరుతో పోలిస్తే అది తక్కువగానే కనిపించింది. తుషార్‌ వేసిన 17వ ఓవర్లో పాండే 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. అయితే మిగిలిన 4 ఓవర్లు ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 29 పరుగులు మాత్రమే ఇచ్చింది.   

సమష్టి వైఫల్యం... 
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. రషీద్‌ తన తొలి ఓవర్లోనే స్టొయినిస్‌ (5), హెట్‌మైర్‌ (16)లను అవుట్‌ చేశాడు. ఓపెనర్‌ రహానే (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలువలేదు. కెప్టెన్‌ అయ్యర్‌ (7) వైఫల్యంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది.  

సాహా కీపింగ్‌కు దూరం... 
అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన సాహా కండరాలు పట్టేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపింగ్‌ చేయలేకపోయాడు. అతని స్థానంలో శ్రీవత్స్‌ గోస్వామి కీపర్‌గా వ్యవహరించాడు. మరోవైపు విజయ్‌ బౌలింగ్‌ చేస్తూ గాయం కారణంగా మధ్యలో తప్పుకోవడంతో అతని రెండో ఓవర్‌ను వార్నర్‌ పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 66; సాహా (సి) అయ్యర్‌ (బి) నోర్జే 87; పాండే (నాటౌట్‌) 44; విలియమ్సన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 219.
వికెట్ల పతనం: 1–107; 2–170.

బౌలింగ్‌: నోర్జే 4–0–37–1; రబడ 4–0–54–0; అశ్విన్‌ 3–0–35–1; అక్షర్‌ పటేల్‌ 4–0–36–0; తుషార్‌ 3–0–35–0; స్టొయినిస్‌ 2–0–15–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌; ధావన్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 0; స్టొయినిస్‌ (సి) వార్నర్‌ (బి) నదీమ్‌ 5; హెట్‌మైర్‌ (బి) రషీద్‌ 16; పంత్‌ (సి) (సబ్‌) గోస్వామి (బి) సందీప్‌ 36; అయ్యర్‌ (సి) విలియమ్సన్‌ (బి) శంకర్‌ 7; అక్షర్‌ (సి) (సబ్‌) గార్గ్‌ (బి) రషీద్‌ 1; రబడ (బి) నటరాజన్‌ 3; అశ్విన్‌ (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 7; తుషార్‌ (నాటౌట్‌) 20; నోర్జే (సి) (సబ్‌) గార్గ్‌ (బి) నటరాజన్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 131.  

వికెట్ల పతనం: 1–1; 2–14; 3–54; 4–55; 5–78; 6–83; 7–103; 8–103; 9–125; 10–131.
బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–27–2; షహబాజ్‌ నదీమ్‌ 1–0–8–1; హోల్డర్‌ 4–0–46–1; రషీద్‌ 4–0–7–3; నటరాజన్‌ 4–0–26–2; విజయ్‌ శంకర్‌ 1.5–0–11–1; వార్నర్‌ 0.1–0–2–0.

>
మరిన్ని వార్తలు