సూర్యకుమార్‌పై ప్రశంసలు.. కాస్త ఓపిక పట్టు!

29 Oct, 2020 14:08 IST|Sakshi

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2020 సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్స్‌ చాలెంజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(43 బంతుల్లో 79 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివరికంటా అజేయంగా నిలిచి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌ సందర్బంగా కోహ్లి, సూర్యకుమార్‌ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 13ఓవర్‌లో కోహ్లి బంతిని చేతితో షైన్‌ చేస్తూ సూర్యకుమార్‌ యాదవ్‌ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగాడు. కానీ అతడు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా, తనను తీక్షణంగా చూస్తున్న కోహ్లికి కళ్లతోనే బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: మొదటి అడుగు ముంబైదే!)

ఈ క్రమంలో.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా జాతీయ జట్టు సెలక్షన్‌లో తనను పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటని సూర్యకుమార్‌, కోహ్లిని కళ్లతోనే ప్రశ్నిస్తున్నాడని, ఈ చూపుల యుద్ధంలో ఆఖరికి అతడే గెలిచాడని తమకు తోచిన విధంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేశవాళి, ఐపీఎల్‌ టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తున్నా తనను పక్కకు పెట్టిన వాళ్లు ఇప్పటికేనా కళ్లు తెరవాలంటూ హితవు పలుకుతున్నారు. కాగా బుధవారం నాటి అద్భుత ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, అభిమానులు సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

జాతీయజట్టులో ఎంపిక కావాలంటే అతడు ఇంకేం చేయాలో అంటూ సెలక్టర్లపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇక టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి.. ‘‘సూర్య నమస్కార్‌. ధైర్యంగా, కాస్త ఓపికగా ఉండు’’ అంటూ అతడికి సూచించడం గమనార్హం. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు