అది అంత హైలెట్‌ అవుతుంది అనుకోలేదు: సూర్యకుమార్‌

21 Nov, 2020 14:46 IST|Sakshi

కోహ్లి కవ్వింపు చర్యలు: సూర్యకుమార్‌ స్పందన

న్యూఢిల్లీ: ‘‘అసలు ఆరోజు జరిగింది అంత పెద్ద విషయమేమీ కాదు. హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతున్న వేళ ఆ ఘటన చోటుచేసుకుంది. నిజానికి అది అంతగా హైలెట్‌ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’’  అంటూ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్సీబీ సారథి, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌-2020 సీజన్‌లో  సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రాయల్‌ చాలెంజర్స్‌ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. సదరు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన డిపెండింగ్‌ చాంపియన్‌, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా సూర్యకుమార్‌, కోహ్లి మధ్య జరిగిన ఘటన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. (చదవండి: మూడోసారి తండ్రైన ఏబీ డివిల్లియర్స్‌)

ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో కోహ్లి బంతిని షైన్‌ చేస్తూ యాదవ్‌ వద్దకు వచ్చి దూకుడు ప్రదర్శించాడు. అయితే అతడు మాత్రం ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ కోహ్లి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే టీమిండియా జట్టును ప్రకటించగా, సూర్యకుమార్‌కు అందులో చోటు దక్కకపోవడంతో..  దేశవాళీ, ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా.. అతడిని ఉద్దేశపూర్వకంగానే జాతీయ జట్టులోకి ఎంపిక చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.(చదవండి: సూర్యకుమార్‌పై ప్రశంసలు.. కాస్త ఓపిక పట్టు!)

ఇక ఆనాటి ఘటనపై స్పందించిన సూర్యకుమార్‌ యాదవ్ స్పోర్ట్స్‌ తక్‌తో మాట్లాడుతూ‌.. ‘‘కేవలం ముంబై ఇండియన్స్‌పై ఆడిన మ్యాచ్‌లోనే కాదు.. ప్రతీ మ్యాచ్‌లోనూ తాను ఎనర్జిటిక్‌గానే కనిపిస్తాడు. టీమిండియాకు ఆడినా, ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌ అయినా, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తను అంతే దూకుడుగా ఉంటాడు. నిజానికి ఆనాటి మ్యాచ్‌ ఆర్సీబీకి ఎంతో కీలకమైంది. బహుశా అందుకే అలా జరిగిందేమో. కానీ మ్యాచ్‌ ముగిసిన తర్వాత తను నార్మల్‌ అయిపోయాడు. అంతేకాదు బాగా ఆడావంటూ నాకు శుభాకాంక్షలు తెలిపాడు కూడా’’ అని కోహ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఇక తనను ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించినప్పటికీ, ఏదేమైనా షో కొనసాగుతూనే ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. రోహిత్‌ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐపీఎల్-2020‌ ట్రోఫీని సొంతం చేసుకుని, ఐదోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు