ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్‌!

30 Oct, 2020 17:34 IST|Sakshi

లండన్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ యూకేలోనూ రికార్డులు బద్ధలు కొడుతోంది. వ్యూయర్‌షిప్‌ పరంగా ఐపీఎల్‌ యూకేలో కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్‌లో అత్యధిక ఆదరణ ఉన్న ఫుట్‌బాల్‌ లీగ్‌లో ఒకటైన ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఈపీఎల్‌) ను కూడా దాటేసి అత్యధిక వ్యూస్‌ను సాధించింది ఐపీఎల్‌. బ్రాడ్‌క్యాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ బోర్డు (బీఏఆర్‌బీ) నివేదిక ప్రకారం..  వారం రోజుల  వ్యవధిలో ఐపీఎల్-2020 సీజన్‌ను  7,97,000 మంది తిలకించారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను యూకేలో తిలకించిన వారి సంఖ్య. ఈ తరహాలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ను యూకేలో వీక్షించడం ఇదే తొలిసారి. (‘టాప్‌ మోస్ట్‌ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు’)

అంతకుముందు ఈపీఎల్‌ కూడా ఇంతటి స్థాయిలో  వ్యూయర్‌షిప్‌ లభించలేదని బీఏఆర్‌బీ తన ప‍్రకటనలో తెలిపింది. గతేడాది ఐపీఎల్‌తో పోల్చుకున్నా కూడా ప్రస్తుత ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌ అత్యధికమని పేర్కొంది. గత కొన్ని వారాల నుంచి యూకేలో ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది.  యూకేలో గత ఐపీఎల్‌ సీజన్ మ్యాచ్‌లను 5,86,000 మంది తిలకించగా.. ఈ సీజన్ నాటికి ఆ సంఖ్య మరింత పెరిగింది.  ప్రస్తుత ఐపీఎల్‌కు యూకేలో 11 శాతం వ్యూయర్‌షిప్‌ పెరిగిందని, ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి వ్యూవర్‌షిప్ మరింత పెరగొచ్చనే అంచనాల ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా న్యూ క్యాజిల్ యునైటెడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను 40 వేల మంది వీక్షించారు. లివర్‌పూల్-షెఫ్ఫీల్డ్ యునైటెడ్ మ్యాచ్‌ను 1,10,000 మంది, ఆర్సెనాల్-లీసెస్టర్ సిటీ మ్యాచ్‌ను 1,40,000 మంది వీక్షించారు.(ప్లేఆఫ్స్‌ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)

మరిన్ని వార్తలు