సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వ ఉద్యోగులా?!

9 Oct, 2020 11:32 IST|Sakshi

ధోనీ టీమ్‌పై సెహ్వాగ్‌ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్‌ ముఖ్యంగా క్రీడా వార్తలపై తనదైన శైలిలో కామెంట్లతో అలరిస్తారు. తాజాగా ఆయన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేశారు. కోల్‌కోతాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధోని సారథ్యంలో కొందరు బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నంత తీరుబడిగా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా చెన్నై బ్యాట్స్‌మన్‌ పేలవ ప్రదర్శన ఆశ్చర్యానికి గురి చేసిందని తన ఫేస్‌బుక్‌ పేజీ ‘వీరు కి బైటక్‌’లో చెప్పుకొచ్చారు.
[ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ]

కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ ఆటతీరు జట్టుకు ఏమాత్రం ప్రయోజనం కలిగించ లేదని అన్నారు. జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని పేర్కొన్నారు. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన జాదవ్‌కు మ్యాన్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఇవ్వాల్సిందని చురకలు వేశాడు. కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో వీరవిహారం చేసిన చెన్నై ఓపెనర్లు జట్టుకు సునాయాస విజయాన్ని అందించగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో తేలిపోయారు. మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి దిగినా 157 పరుగులే చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ నిర్ణయాలు కూడా మరోసారి పరిశీలనకు వచ్చాయని కొందరు క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
(చదవండి:‘వీళ్లిద్దరూ డాట్‌ బాల్స్‌ ఇలాగే తింటారు’)

డ్వేన్‌ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజాను కాదని, కెప్టెన్‌ ధోని జాదవ్‌ను ముందు బ్యాటింగ్‌కు పంపడమే దీనికి కారణం. ఈసారి కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 12 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తం మీద సమష్టిగా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో 10 పరుగుల తేడాతో సీఎస్‌కే పరాజయం పాలైంది. ఆడిన ఆరు మ్యాచ్‌లలలో రెండింట మాత్రం చెన్నై విజయం సాధించింది. గత 12 ఐపీఎల్‌ సీజన్లలో చైన్నై జట్టు 8 సార్లు ఫైనల్‌ చేరింది. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఇదిలాఉండగా.. చైన్నై, బెంగుళూరు మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది.
(చదవండి: చెన్నైకి చేతకాలేదు)

మరిన్ని వార్తలు