ఏందిది.. ధోనికి అంపైర్‌ భయపడ్డాడా?

14 Oct, 2020 10:23 IST|Sakshi

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ వ్యవహరించిన తీరు చర్చకు దారి తీసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. అయితే, ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ అంపైర్‌ రీఫెల్‌ నిర్ణయం క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఆ ఓవర్‌లో శార్దుల్‌ వేసిన రెండో బంతి క్రీజ్‌కు చాలా దూరంగా వెళ్లింది. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ]

దీనిని వైడ్‌గా ప్రకటించేందుకు కొంత వరకు అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ చేతులు కూడా ఎత్తేశాడు. అయితే అటు ధోని, ఇటు శార్దుల్‌ తమ అసహనాన్ని ప్రదర్శించడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఎలా చూసినా అది స్పష్టంగా ‘వైడ్‌’ అని తెలిసిపోతోంది. టీవీ రీప్లేలో కూడా అది స్పష్టంగా కనిపించింది. అయితే 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్‌ రీఫెల్‌ ఆటగాళ్ల ఒత్తిడితో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. రైజర్స్‌ కెప్టెన్‌ వార్నర్‌ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కనిపించింది. సన్‌రైజర్స్‌ అభిమానులు రీఫెల్‌కు అంపైరింగ్‌ నేర్పించాలని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. అంపైర్‌ ధోనికి భయపడి నిర్ణయాన్ని మార్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. 
(చదవండి: ‘సన్‌’కు చెన్నై చెక్‌... )

మరిన్ని వార్తలు