రూ. 8 కోట్లు పెట్టి కొన్నారు.. మెరెడిత్‌కు స్థానం లేదా!

5 Apr, 2021 15:12 IST|Sakshi

IPL 2021: పంజాబ్‌ జట్టు కూర్పుపై ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ ఓపెనింగ్‌ జోడీగా కొనసాగితే పంజాబ్‌ కింగ్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా మయాంక్‌ అగర్వాల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని సూచించాడు. క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్‌ ఐపీఎల్-2021‌ ఏప్రిల్‌ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు జట్లు ప్రాక్టీసులో దుమ్మురేపుతూ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల బలాలు, ఏ ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్న అంశంపై మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తూ, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో, ఆకాశ్‌ చోప్రా పంజాబ్‌ జట్టు గురించి మాట్లాడుతూ... ‘‘ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ ఓపెనర్లుగా మైదానంలోకి దిగాలి. మూడో స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌, నాలుగో స్థానంలో పూరన్‌, ఐదో స్థానంలో హుడా, మోజెస్‌ హెన్రిక్స్‌ ఆరో స్థానంలో రావాలి. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌  ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది. ఇక ఏడో స్థానం గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. షారుఖ్‌, మణిదీప్‌, సర్ఫరాజ్‌.. వీరిలో ఎవరినైనా తీసుకోవచ్చు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే, అశ్విన్‌, బిష్ణోయి, షమీ, రిచర్డ్‌సన్‌ ఉండనే ఉన్నారు. జట్టు కూర్పు ఇలా ఉన్నట్లయితే, ఈ సీజన్‌లో పంజాబ్‌ మెరుగ్గా రాణించడం తథ్యమని నా భావన. వీరితో పాటు మరో ఆప్షన్‌ అర్ష్‌దీప్‌ కూడా ఉన్నాడు. కావాలంటే మరో స్పిన్నర్‌ కావాలంటే తనను తీసుకోవచ్చు ’’ అని చెప్పుకొచ్చాడు.

అయితే, ఆకాశ్‌ చోప్రా జట్టులో, పంజాబ్‌ జట్టు యువ ఆటగాడు ఆస్ట్రేలియా టీ20 ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరెడిత్‌కు మాత్రం స్థానం చోటు దక్కకపోవడం గమనార్హం. మెరెడిత్‌ను పంజాబ్‌ ప్రాంఛైజీ రూ. 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన మినీ ఐపీఎల్‌ వేలంలో విదేశీ ఆటగాళ్ల విభాగంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఈ నేపథ్యంలో.. ‘‘మీ అభిప్రాయం ప్రకారం మెరెడిత్‌కు అంతప్రాధాన్యం లేనట్లుగా కనిపిస్తోంది. అంత ధర పెట్టి కొనడం వృథానే కదా. ఇంకో విషయం, ఫాబియన్‌ అలెన్‌ను మర్చిపోయారు. అతడిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది’’ అంటూ తమకు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు.  ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఏప్రిల్‌ 12న తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు!
ఐపీఎల్‌-2021: పంజాబ్‌ కింగ్స్‌ స్క్వాడ్‌... ఇతర వివరాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు