Aakash Chopra: నీకు స్పీడ్‌ ఎక్కువైంది.. చలాన్లు పడుతాయేమో చూసుకో

23 Sep, 2021 16:52 IST|Sakshi

Aakash Chopra Lauds Anrich Nortje.. అన్‌రిచ్‌ నోర్జ్టే.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇదే నోర్ట్జే ఐపీఎల్‌ 2020కి సంబంధించి జరిగిన వేలంలో అన్‌సోల్డ్‌ ఆటగాడిగా మిగిలిపోయాడు.  కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న క్రిస్‌ వోక్స్‌ గాయం కారణంగా లీగ్‌ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో  జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన నోర్ట్జే 22 వికెట్లతో దుమ్మురేపాడు. కగిసో రబడ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి అ‍త్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

చదవండి: Shreyas Iyer: ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఇప్పుడు కూడా

కట్‌చేస్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భారత్‌లో జరిగిన తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ నోర్జ్టేకు స్థానం దక్కలేదు. అయితే యూఏఈ గడ్డపై సీజన్‌ రెండో అంచె పోటీలు ప్రారంభం కాగానే మళ్లీ జట్టులోకి వచ్చిన నోర్ట్జే బుధవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసిన నోర్ట్జే 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. డేవిడ్‌ వార్నర్‌, కేదార్‌ జాదవ్‌ వికెట్లను తీసిన నోర్ట్జే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. నోర్జ్టే నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన ప్రతీసారి 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసరడం విశేషం. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా నోర్ట్జేను ఆటపట్టించాడు. నీకు ఓవర్‌ స్పీడ్‌ ఎక్కువైంది.. చలాన్లు పడుతాయేమో చూసుకో అంటూ అతని బౌలింగ్‌ స్పీడ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. 

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అబ్దుల్‌ సమద్‌ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్‌ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌), పంత్‌ (21 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)  రాణించారు.

చదవండి: Sanju Samson: దేవుడిచ్చిన టాలెంట్‌ను అనవసరంగా వేస్ట్‌ చేస్తున్నాడు

మరిన్ని వార్తలు