ఎస్‌ఆర్‌హెచ్‌లో అనుకున్నంత బలం లేదు: డివిలియర్స్‌

14 Apr, 2021 14:30 IST|Sakshi
కర్టసీ: ఆర్‌సీబీ ట్విటర్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవడంలో ఏబీ డివిలియర్స్‌ కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో 48 పరుగులతో ఏబీ విజృంభించడంతో ఆర్‌సీబీ ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్‌ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ నాకు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుంది. ఆ జట్టుతో మ్యాచ్‌ ఆడడం నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. బ్యాటింగ్‌ విభాగం కంటే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వార్నర్‌ నాకు ఎప్పుడు ప్రత్యర్థిగా ఎదురుపడినా.. మా ఇద్దరి పోరు మజాను పంచుతుంది. అయితే ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మరి అంత బలంగా ఏం కనిపించడం లేదు. మ్యాచ్‌ ఆరంభంలోనే వారిపై పట్టు సాధిస్తేనే వారు ఒత్తిడిక గురయ్యే అవకాశం ఉంటుంది. మా జట్టు నుంచి రెండు మంచి భాగస్వామ్యాలు ఏర్పడితే మాత్రం మేం ముందంజలో ఉంటాం. కానీ తమది అనుకున్న రోజు ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రమాదకారి అన్న విషయం మాత్రం ఎన్నటికి గుర్తుపెట్టుకుంటాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మరోవైపు కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ చివర్లో తడబడి పరాజయం పాలైంది. బెయిర్‌ స్టో సూపర్‌ ఇన్నింగ్స్‌.. మనీష్‌ పాండే క్లాస్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా ఓటమిని చవిచూసింది. 
చదవండి: మొన్న హర్షల్‌.. ఈరోజు రసెల్‌.. మళ్లీ అదే జట్టు

మరిన్ని వార్తలు