రహానే, పాండ్యా బ్రదర్స్‌ ఉదారత.. భారీ మొత్తంలో

1 May, 2021 20:10 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు.ఇప్పటికే పాట్‌ కమిన్స్‌, బ్రెట్‌ లీ, సచిన్‌, శిఖర్‌ ధావన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే.  

తాజాగా అజింక్య రహానేతో పాటు పాండ్యా బ్రదర్స్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానే 30 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను మిషన్‌ వాయు అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వగా.. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న కృనాల్‌, హార్దిక్‌ పాండ్యాలు 200 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను రూరల్‌ ఇండియాకు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. 

ఈ నేపథ్యంలో రహానె చేసిన సాయానికి మహారాష్ట్ర ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను మహారాష్ట్రలోని అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాలకు వీటిని పంపుతామని ప్రకటించింది. ‘మిషన్‌ వాయుకు 30 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ అందించిన రహానేకు ధన్యవాదాలు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న జిల్లాలకు వీటిని అందజేస్తామని’ ట్వీట్‌ చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశంలో ప్రతిరోజూ 4లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు