'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'

21 Apr, 2021 14:03 IST|Sakshi
Courtesy : IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం వెనుక సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కీలకంగా వ్యవహరించాడు. 4 ఓవర్లు వేసిన మిశ్రా 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్‌ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. అమిత్‌ మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉ‍న్నాడు. ఈ సీజన్‌లో ఇంకా ఢిల్లీ చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ  రికార్డును తొందరగానే బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. అయితే తాను రికార్డులు సాధించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఫోకస్‌ పెట్టినట్లు మిశ్రా తెలిపాడు. మ్యాచ్‌ విజయం అనంతరం పృథ్వీ షాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

''నేనెప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అసలు లసిత్‌ మలింగ రికార్డు బ్రేక్‌ చేయబోతున్నానే విషయం నాకు తెలియదు.  రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్‌ చేసినంత మాత్రానా నాకు వచ్చేది ఏం లేదు.. కేవలం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరు తప్ప.. ప్రస్తుతం నా దృష్టంతా వికెట్లు తీసి ఢిల్లీ జట్టును గెలిపించడమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్‌శర్మను ఐపీఎల్‌లో 7సార్లు ఔట్‌ చేయడంపై మిశ్రాను అడగ్గా.. '' రోహిత్‌కు బౌలింగ్‌ వేసేటప్పుడు అతను హిట్టింగ్‌ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్‌ డెలివరీలు ఉండడంతో రోహిత్‌ అవుటవుతున్నాడు. అయితే రోహిత్‌ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు.'' అంటూ తెలిపాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.
చదవండి: మిశ్రా నువ్వు తోపు.. వచ్చీ రావడంతోనే

ఐపీఎల్‌ 2021: అతను వండర్స్‌ చేయగలడు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు