గుండె పగిలిపోతోంది: ఆస్ట్రేలియన్‌ ప్రజెంటర్‌ భావోద్వేగం

22 May, 2021 12:11 IST|Sakshi

ఇండియా నన్ను ఆదరించింది

ఎన్నో మధుర జ్ఞాప​కాలు మిగిల్చింది

అందరికీ ధన్యవాదాలు

సిడ్నీ: ‘‘థాంక్యూ ఇండియా.. నన్ను సొంత మనిషిలా ఆదరించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. దయార్ద హృదయం, ఇతరులపై కూడా ప్రేమను కురిపించే గల మంచి మనుషులు అక్కడ ఉన్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది’’అంటూ ఐపీఎల్‌-2021 ప్రజెంటర్‌, ఆస్ట్రేలియన్‌ నెరోలీ మెడోస్‌ భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. కోవిడ్‌-19తో పోరాడుతున్న భారత్‌కు సహాయం అందించాలనుకునే ఆస్ట్రేలియన్లు, యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా ద్వారా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా మహమ్మారి కరోనా ఉధృతి నేపథ్యంలో ఆటగాళ్లు వరుసగా వైరస్‌ బారిన పడటంతో ఐపీఎల్‌-2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టీవీ ప్రజెంటర్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే, భారత్‌ను ఇలాంటి పరిస్థితుల్లో విడిచి వెళ్లడం వేదనకు గురిచేసిందని ఇప్పటికే పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో నెరోలీ మెడోస్‌ సైతం.. భారత్‌లో ఉన్ననాళ్లూ అక్కడి ప్రజలు, సహచర ఉద్యోగులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధురాలిని అయ్యానంటూ అభిమానం చాటుకుంటున్నారు. 

‘ఎన్నో మధుర జ్ఞాపకాలు.. ఇప్పటికీ నా బాగోగుల గురించి అడుగుతున్నారు. క్లిష్ట సమయంలోనూ నా మంచి గురించి ఆలోచిస్తున్నారు.  ఈ సందర్భంగా బీసీసీఐ. స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా, సంజనా గణేషన్‌, భావనా బాలక్రిష్ణన్‌ తదితరులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. నన్ను సొంత మనిషిలా జాగ్రత్తగా చూసుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేర్చారు. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని. ఇండియా త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నెరోలీ సంజనా గణేషన్‌, బ్రెట్‌ లీతో పాటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

చదవండి: పుజారా ఆస్ట్రేలియన్‌ మాదిరిగానే బ్యాటింగ్‌ చేశాడు..

మరిన్ని వార్తలు