సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్‌ గుర్తుకో తెచ్చుకో రసెల్‌..!

11 Apr, 2021 16:35 IST|Sakshi
ఆండ్రీ రసెల్‌(కేకేఆర్‌ ట్వీటర్‌ అకౌంట్‌)

చెన్నై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో  ఆండ్రీ రసెల్‌  కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించనున్నాడు. ఈ మేరకు రసెల్‌ న్యూలుక్‌లో ఉన్న ఫోటోను కేకేఆర్‌ తమ ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ‘ కొత్త హెయిర్‌ స్టైల్‌. అతను ఎవరు?,  నీ గత హెయిర్‌ స్టైల్‌తో ఏమి జరిగిందో గుర్తుంచుకో’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.  2019 ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. తలపై హెయిర్‌ చుట్టూ తీసేసి మధ్య భాగంలో మాత్రమే ఉంచుకుని డిఫరెంట్‌గా కనిపించాడు.

ఆ మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. సన్‌రైజర్స్‌తో రెండో లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో కేకేఆర్‌ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే  సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. ఇదే విషయాన్ని కేకేఆర్‌ చెప్పకనే చెబుతున్నట్లు ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. ఆదివారం(ఏప్రిల్‌11వ  తేదీ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కేకేఆర్‌లు తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్నాయి. 

కేకేఆర్‌ సక్సెస్‌ కావాలంటే వారు హిట్‌ కావాలి
గత ఐపీఎల్‌ సీజన్‌లో చివరివరకూ ప్లే ఆఫ్‌ రేసు కోసం పోటీ పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చుక్కెదురైంది.  లీగ్‌ దశలో ఏడు విజయాలు సాధించిన కేకేఆర్‌ ఐదో స్థానంలో నిలిచింది. రన్‌రేట్‌ కారణంగా కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ నెరవేరలేదు. ఆ జట్టులో అంతా హార్డ్‌ హిట్టర్లే ఉన్నా ఓవరాల్‌గా విఫలం కావడం ఆ జట్టు ప్లే ఆఫ్‌ ఆశలపై ప్రభావం చూపించింది. ఇక్కడ ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్‌తో నాల్గో స్థానాన్ని దక్కించుకోవడంతో కేకేఆర్‌ ఆట లీగ్‌ దశలోనే ముగిసింది. మరి ఈ సీజన్‌లో కేకేఆర్‌ మరొకసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని కేకేఆర్‌.. తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్‌ వేదికగా తలపడనుంది. ఇరుజట్లలో స్టార్‌ ఆటగాళ్లు ఉండటంతో అభిమానులు మరొకసారి మంచి మజాను ఆస్వాదించే అవకాశం ఉంది. 

కాగా,  గత సీజన్‌ నుంచి కేకేఆర్‌ను బ్యాటింగ్‌ సమస్స వేధిస్తోందని, ఒకవేళ బ్యాటింగ్‌లో 5, 6 స్థానాల్లో  ఆ జట్టు మెరిస్తే తిరుగుండదని టీమిండియా మాజీ క్రీకెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్‌ సక్సెస్‌ అనేది ఐదు, ఆరు స్థానాల్లో తరచుగా బ్యాటింగ్‌కు వచ్చే ఆండ్రీ రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌లపై ఆధారపడి ఉందన్నాడు. వీరిద్దరూ హిట్‌ అయిన పక్షంలోనే కేకేఆర్‌ ఆశలు పెట్టుకోవచ్చన్నాడు. ప్రధానంగా రసెల్‌ ఆల్‌రౌండర్‌గా కాబట్టి అతని ఆట కీలకమని చోప్రా పేర్కొన్నాడు. ఇక దినేశ్‌ ఆరంభం నుంచే షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నాడు. 

మరిన్ని వార్తలు