'ఎడమకాలుతో దాటుతా.. బ్యాట్‌ను నాలుగుసార్లు తిప్పుతా'

23 Apr, 2021 17:58 IST|Sakshi
Courtesy: IPL

ముంబై: ప్రతి మనిషికి మూడ నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన దేవుడిని తలుచుకోవడమో లేక ఇంకా ఏదైనా పని చేస్తుంటారు. అలా చూసుకుంటే ఒక క్రికెటర్‌కు కూడా మూడ నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెడుతాడు. సచిన్‌ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసిన తర్వాత బరిలోకి దిగుతారు. అలాంటి మూడ నమ్మకాలు నాకు ఉన్నాయని కేకేఆర్‌ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్‌ పేర్కొన్నాడు.

కేకేఆర్‌ యాజమాన్యం నైట్‌క్లబ్‌ సిరీస్‌ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి రసెల్‌తో పాటు శివమ్‌ మావి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్య్వూలో​ రసెల్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.''ప్రతీ ఆటగాడికి కొన్ని మూడ నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని ఎక్కువ నమ్మితే.. మరికొందరు ఆచరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాడిని. మైదానంలో అడుగుపెట్టే ముందు ప్రతీసారి నా ఎడమకాలుతో బౌండరీ రోప్‌ను దాటడం చేస్తుంటాను. ఆ తర్వాత బౌలర్‌ వేసే మొదటి బంతిని ఎదుర్కోవడానికి ముందు బ్యాట్‌ను నాలుగు.. అంతకంటే ఎక్కువసార్లు తిప్పుతాను. అలా చేయకపోతే.. నాకు ఆరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయలేనని నమ్మకం.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బుధవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసం అంత తొందరగా మరిచిపోలేం. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన కేకేఆర్‌ను కార్తిక్‌ సాయంతో రసెల్‌ ఇన్నింగ్స్‌ నడిపిన తీరు అద్బుతం. 22 బంతుల్లో 54 పరుగులు చేసిన రసెల్‌ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రసెల్‌ ఔటైన తర్వాత కమిన్స్‌ (34 బంతుల్లో 66 నాటౌట్‌, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఒక దశలో గెలుపుకు దగ్గరైనా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 18 పరుగుల తేడాతో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 24న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!
ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్‌ చేసుకున్నారు..
రసెల్‌ ఔట్‌ ప్లాన్‌లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు