అసలు మీ స్ట్రాటెజీ ఏంటి: అలా ఐతే షమీతో ఓపెనింగ్‌ చేయించండి!

19 Apr, 2021 12:29 IST|Sakshi

పంజాబ్‌ తీరుపై ఆశిష్‌ నెహ్రా తీవ్ర అసహనం

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ తీరుపై టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా పెదవి విరిచాడు. సమర్థులైన బౌలర్లు అందుబాటులో ఉన్నా వారి సేవలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటువంటి తప్పిదాలే పంజాబ్‌ కింగ్స్‌ కొంపముంచాయని, ఇప్పటికైనా కెప్టెన్‌, కోచ్‌ కలిసి మెరుగైన ప్రణాళికలు రూపొందించాలని హితవు పలికాడు. కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ, పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆకాశమే హద్దుగా(49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో రాహుల్‌ సేన తలవంచకతప్పలేదు. 

ఈ నేపథ్యంలో ఆశిష్‌ నెహ్రా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు ఎంత బాగా బౌల్‌ చేసినా, మెరుగ్గా బ్యాటింగ్‌ చేసినా, అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసినా ఫలితాలు మనకు అనుకూలంగా రావు. కొన్నిసార్లు గెలుస్తాం. కొన్నిసార్లు ఓడిపోతాం. ఆటలో ఇవన్నీ సహజం. కానీ, పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నప్పుడు కూడా, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే ఇలాగే చేదు అనుభవాలు ఎదురవుతాయి. కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. తొలి ఓవర్లలో వారికి బౌలింగ్‌ చేసే చాన్స్‌ ఎందుకు ఇవ్వలేదు. 

నిజానికి, 10 ఓవర్ల తర్వాత రంగంలోకి దిగిన మెరెడిత్‌, తన తొలి ఓవర్‌లోనే స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీశాడు. షమీ కూడా వేసిన నాలుగు ఓవర్లలోనూ విభిన్నమైన స్పెల్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ మీరు అర్ష్‌దీప్‌నకు ప్రాధాన్యం ఇచ్చారు. అసలు, మీరు ఫ్రంట్‌ఎండ్‌ నుంచి గేమ్‌ను కంట్రోల్‌ చేస్తున్నారా లేదా బ్యాక్‌ఎండ్‌ నుంచా’’ అంటూ రాహుల్‌ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఒకవేళ మీ వ్యూహం అదే అయితే, ఇకపై కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా రాకూడదు. అతడి స్థానంలో జలజ్‌ సక్సేనా, షమీ లేదంటే షారుఖ్‌లతో ఓపెనింగ్‌ చేయించాలి’’ అని నెహ్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కెప్టెన్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో కలిసి కూర్చుని చర్చించాలని, తదుపరి మ్యాచ్‌లోనైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు.

చదవండిఅంపైర్లను బాల్‌ మార్చమని పదే పదే అడిగా: రాహుల్‌
IPL 2021, DC vs PBKS: ధావన్‌ ధనాధన్‌...

మరిన్ని వార్తలు