‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’

20 Feb, 2021 14:35 IST|Sakshi

రూ. 1.20 కోట్లు పలికిన ఆటగాడు.. కుటుంబంలో తీవ్ర విషాదం

న్యూఢిల్లీ: ‘‘గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్‌ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు.

కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ చేతన్‌ సకారియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్‌ కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరచగా, రాజస్తాన్‌  రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు భారీ మొత్తం దక్కడంతో అతడి పంట పండినట్లయింది. అయితే అదే సమయంలో తమ్ముడిని కోల్పోయిన బాధ అతడిని వెంటాడుతోంది. ఈ విషయాల గురించి చేతన్‌ మాట్లాడుతూ... ‘‘మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. 

ఇక ఇప్పుడు ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్‌ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్‌ఆర్‌ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: ఐపీఎల్‌ 2021 మినీ వేలం పూర్తి వివరాలు
చదవండి: ఐపీఎల్‌ వేలం: అజారుద్దీన్‌ తీవ్ర అసంతృప్తి!
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు