ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్‌.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు

16 Apr, 2021 17:30 IST|Sakshi
Photo Courtesy : ipl twitter

చెన్నై:  అవేశ్‌ ఖాన్‌.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అందర్నీ ఆకర్షిస్తున్న ప్లేయర్‌. ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఐదు వికెట్లు సాధించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించిన అవేశ్‌ ఖాన్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు. ఇప్పుడు ఢిల్లీకి ప్రధాన బౌలింగ్‌ ఆయుధంగా మారిపోయాడు అవేశ్‌ ఖాన్‌. ఈ సీజన్‌ ఆరంభం వరకూ అవేశ్‌ ఖాన్‌ స్థానానికి గ్యారంటీ లేదు. ఇషాంత్‌ శర్మ గాయం కావడంతో అవేశ్‌ ఖాన్‌కు అవకాశం కల్పించక తప్పలేదు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అవేశ్‌. ఇప్పుడు అవేశ్‌ ఖాన్‌ జట్టులో లేకుండా ఢిల్లీ మ్యాచ్‌లంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో 5.80 ఎకానమీతో బౌలింగ్‌ చేసిన అవేశ్‌ ఖాన్‌.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 8.00 ఎకానమీ నమోదు చేశాడు. 

ఇప్పుడు అవేశ్‌ ఖాన్‌ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. రాజస్థాన్‌పై మ్యాచ్‌ తర్వాత అవేశ్‌ ఖాన్‌ హాట్‌ టాపిక్‌ అయ్యాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అవేశ్‌ ఖాన్‌..ఇండోర్‌లో 1996 డిసెంబర్‌ 13వ తేదీన జన్మించాడు. 2016లో అండర్‌-19 తరఫున వరల్డ్‌కప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడు. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ను 2014లో ఆరంభించిన అవేశ్‌.. ఇప‍్పటివరకూ 26 మ్యాచ్‌లు ఆడాడు. ఆ 26 మ్యాచ్‌ల్లో కలిపి 100 వికెట్లను సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 7/24 కాగా, ఒక మ్యాచ్‌లో బెస్ట్‌ 12/54గా ఉంది. ఇక లిస్ట్‌-ఎలో 16 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీయగా,  20 టీ20 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు సాధించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు 10 వికెట్లు సాధించాడు.

ఆర్సీబీతో అరంగేట్రం.. 
అవేశ్‌ ఖాన్‌ టీ20 అరంగేట్రం ఆర్సీబీతో జరిగింది. 2017 ఐపీఎల్‌లో అతన్ని ఆర్సీబీ తీసుకుంది.  కాగా,  ఆ ఐపీఎల్‌లో కేవలం ఒక మ్యాచే ఆడగా, ఆపై అతన్ని వదిలేసింది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.  2018లో జరిగిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వచ్చాడు అవేశ్‌. రూ. 75 లక్షలకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకోగా, ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లే తీశాడు. ఆపై 2019లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కాస్తా ఢిల్లీ క్యాపిటల్స్‌ గా మారగా అప్పట్నుంచి అదే జట్టుకు అవేశ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  2019  సీజన్‌లో అతనికి ఒక మ్యాచే ఆడే అవకాశం దక్కగా,  2020 సీజన్‌లో సైతం ఒక మ్యాచే ఆడాడు.  ఈ ఏడాది  జనవరిలో  ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఎంపిక చేసిన ఐదుగురు నెట్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ ఒకడు. ఇక  2018-19 సీజన్‌లో మధ్యప‍్రదేశ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో అవేశ్‌ 35 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు