'నేను సూపర్‌ ఓవర్‌ వేయడం వెనుక కారణం అదే'

26 Apr, 2021 17:52 IST|Sakshi
courtesy : IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్‌ పటేల్‌ సూపర్‌ ఓవర్‌ వేయగా.. అతని స్పిన్‌ ఆడడంలో విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మన్‌ కేవలం 7 పరుగులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రషీద్‌ వేసిన ఆఖరి బంతికి సింగిల్‌ తీసి విజయం సాధించింది. మ్యాచ్‌ విజయం అనంతరం అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌లు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదట సూపర్‌ ఓవర్‌ తాను వేయాల్సిందని.. ఆఖరి క్షణంలో అక్షర్‌ పటేల్‌ చేతిలోకి బంతి వెళ్లిందని ఆవేశ్‌ ఖన్‌ పేర్కొన్నాడు. ''రిషబ్‌ పంత్‌ దగ్గరకు వెళ్లి ఏం చెప్పావని.. బంతి నీ చేతిలోకి ఎలా వచ్చిందో'' చెప్పాలని అక్షర్‌ను అడిగాడు.

దీనికి అక్షర్‌ స్పందిస్తూ..  సూపర్‌ ఓవర్‌కు మొదట నీ పేరును పరిశీలించిన మాట వాస్తవం. అప్పటికే ఆ జట్టు హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా ఆవేశ్‌ ఖాన్‌ సూపర్‌ ఓవర్‌ వేస్తాడని స్పష్టం చేశాడు. కానీ తాను పంత్‌ దగ్గరకు వెళ్లి.. ఈ పిచ్‌పై స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రావడం కష్టంగా ఉందని.. బ్యాట్స్‌మన్‌ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో సూపర్‌ ఓవర్‌ను ఫాస్ట్‌ బౌలర్‌ కంటే స్పిన్‌ బౌలర్‌తో వేయడం సమంజసమని తెలిపా. అందులోనూ ఎస్ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ వస్తే వార్నర్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ కాబట్టి నా బౌలింగ్‌లో ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతాడు. అందుకే సూపర్‌ ఓవర్‌ నేను వేస్తా అని పంత్‌కు తెలిపా'' అంటూ చెప్పుకొచ్చాడు.

 కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభానికి ముందే కరోనా బారీన పడిన అక్షర్ పటేల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐసోలేషన్‌లో ఉన్న అక్షర్‌ క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకొని ఇటీవలే జట్టుతో కలిశాడు. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.  కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 27న ఆర్‌సీబీతో ఆడనుంది.
చదవండి: బెయిర్‌స్టో అప్పుడు టాయిలెట్‌లో ఉంటే తప్ప: సెహ్వాగ్‌

మరిన్ని వార్తలు