ఈ సీజన్‌కు వార్నర్‌ దూరం!

2 May, 2021 18:08 IST|Sakshi
photo Courtesy: BCCI/PTI

ఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ పదవి నుంచి ఉద్వాసన గురైన డేవిడ్‌ వార్నర్‌.. ఇక మొత్తం సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో వార్నర్‌ ఆడకపోవచ్చని కోచ్‌ ట్రెవర్‌ బెయిలీస్‌ సంకేతాలిచ్చాడు. మళ్లీ వార్నర్‌ ఆటను ఈ సీజన్‌లో చూడకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు. వార్నర్‌ వేటుపై ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బెయిలీస్‌.. జట్టు కూర్పులో భాగంగా వార్నర్‌ ఇక ఆడటం కష్టమని స్పష్టం చేశాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాల కోసం తప్పడం లేదన్నాడు. 

విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్‌ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు వార్నర్‌ పక్కనపెట్టామన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే వ్యూహం కొనసాగవచ్చన్నాడు. శనివారం(మే1వ తేదీ ) వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించిన సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌.. రాజస్థాన్‌తో మ్యాచ్‌ ఆడే క్రమంలో వార్నర్‌ను పక్కన పెట్టేసింది. దాంతో బెయిర్‌ స్టో, మనీష్‌ పాండేలు ఓపెనర్లుగా దిగారు. నేటి మ్యాచ్‌లో వార్నర్‌ స్థానంలో నబీ తుది జట్టులోకి వచ్చాడు. 

మరిన్ని వార్తలు