IPL 2021: రూ. 2,200 కోట్ల నష్టం!

5 May, 2021 00:30 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్‌ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు రూ. 2,200 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... 29 మ్యాచ్‌ల నిర్వహణే సాధ్యమైంది. బోర్డుకు టోర్నీ ప్రసారకర్తలు స్టార్‌ స్పోర్ట్స్‌తో, ఇతర స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి షరతులు, నిబంధనలు ఉన్నాయనే అంశంపై పూర్తి సమాచారం లేకున్నా... అందరూ ఒక్కో మ్యాచ్‌ లెక్కన బోర్డుకు చెల్లిస్తారని తెలుస్తోంది. దీని ప్రకారం బీసీసీఐకి సాధారణంగా వచ్చే ఆదాయంలో దాదాపు 50 శాతం కోత పడవచ్చు.

అయితే టోర్నీ ఈ ఏడాదికి పూర్తిగా రద్దయితేనే నష్టం జరుగుతుందని, మున్ముందు ఏవైనా తేదీల్లో మళ్లీ నిర్వహించగలిగితే సమస్య ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. లీగ్‌కు స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రసారకర్తగా... ‘వివో మొబైల్స్‌’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆటగాళ్లకు కూడా సగం టోర్నీకి లెక్కగట్టి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్పాన్సర్లెవరూ కూడా తమకు జరిగే నష్టం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతానికి దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని... ఇలాంటప్పుడు లీగ్‌ను వాయిదా వేయాలనే బోర్డు నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని మాత్రమే వారు చెప్పారు. అన్నింటికి మించి ఆటగాళ్ల క్షేమమే తమకూ ముఖ్యమని వారు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు