కోహ్లితో ఓపెనర్‌గా అతనైతే బాగుంటుంది, కానీ..

4 Apr, 2021 18:55 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టిన నేపథ్యంలో ఐపీఎల్‌లో సైతం అతను ఓపెనింగ్‌ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ విషయమై కోహ్లి సైతం ఆసక్తి కనబరచడటంతో అతనికి జోడి ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆర్‌సీబీ ఓపెనింగ్‌ స్థానాలపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ స్పందిస్తూ.. కోహ్లితో ఓపెనింగ్‌ స్థానానికి తన ఛాయిస్‌ను వెల్లడించాడు. అతను కోహ్లికి జోడీగా డివిలియర్స్‌‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ పేర్లను పరిశీలించి, చివరకు యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌వైపు మొగ్గు చూపాడు. అయితే ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పడిక్కల్‌ కరోనా బారిన పడటంతో అతను లీగ్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ బలమైన టాపార్డర్‌ కలగి ఉందని హాగ్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అన్ని జట్లతో పోలిస్తే ఆర్‌సీబీ టాప్‌-6 బ్యాట్స్‌మెన్లు చాలా ప్రమాదకరమని వివరించాడు. కోహ్లి, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌, డేనియల్‌ క్రిస్టియన్‌, మహమ్మద్‌ అజహారుద్దీన్‌, ఫిన్‌ అలెన్‌ లాంటి విధ్వంసకర వీరులు ఆర్‌సీబీ టాప్‌-6లో ఉన్నారన్నారు. 

కాగా, గతేడాది ఐపీఎల్‌లో పడిక్కల్‌ ఆర్‌సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2020 సీజన్‌లో అతను 15 మ్యాచ్‌ల్లో 5 అర్ధసెంచరీల సాయంతో 473 పరుగులు సాధించి, కోహ్లి, డివిలియర్స్‌ లాంటి స్టార్‌లచే ప్రశంసలందుకున్నాడు. ఇటీవల ముగిసిన భారత దేశవాళీ టోర్నీలో సైతం అతను పరుగుల వరద పారించాడు. విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 4 శతకాలు బాది 147.70 సగటుతో 737 పరుగులు సాధించాడు. ఈ  టోర్నీలో ముంబై కెప్టెన్‌ పృథ్వీ షా(8 మ్యాచ్‌ల్లో 4 భారీ శతకాల సాయంతో 827 పరుగులు) తరువాత అత్యధిక పరుగులు సాధించింది పడిక్కలే కావడం విశేషం.
చదవండి: ఆటగాళ్లకు కరోనా వ్యాక్సినేషన్‌: బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు